Dentist at doorstep: రాలేని వారి కోసం మనమే వెళ్తే ఆ తృప్తి వేరు: డాక్టర్ అనిత నారాయణన్‌

Dentist at doorstep: రాలేని వారి కోసం మనమే వెళ్తే ఆ తృప్తి వేరు: డాక్టర్ అనిత నారాయణన్‌


Dr. Anitha Narayanan

వయస్సు మీదపడితే… శరీరం సహకరించదు. డాక్టర్ల వద్దకు వెళ్లాలంటే ఆ ప్రయాస మాములుగా ఉండదు. ఒంటరిగా కదలలేని స్థితిలో ఉన్న వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్ద భారం అవుతాయి. ముఖ్యంగా దంత సంబంధిత సమస్యలు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కృంగదీస్తాయి. ఇలా దాదాపు లక్షలాది మంది వృద్ధులు, ఫిజికల్లీ డిపెండెంట్ అయిన వ్యక్తులు, పార్కిన్సన్‌, డిమెన్షియా లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు… ఒక చిన్న చికిత్స కోసం కూడ బంధువులపై ఆధారపడే పరిస్థితిలో ఉన్నారు. ఈ సవాళ్లకు పరిష్కారంగా పుట్టిన సేవే.. ‘డెంటిస్ట్ ఎట్ డోర్‌స్టెప్‌’. వైద్యం ఎదురుచూడాల్సిన అవసరం ఇక లేదు. అవసరమైనప్పుడు, అవసరమైన చోటకే డెంటిస్ట్ వస్తారు.

ఈ కొత్త కాన్సెప్ట్‌ ద్వారా నిపుణులైన డెంటిస్టులు.. పేషెంట్ల ఇంటికి వచ్చి తగిన వైద్యం అందిస్తున్నారు. కావాల్సిన ఎక్విప్‌మెంట్‌తో వారే ఇంటికే వస్తున్నారు. వృద్ధులు, మంచానికి పరిమితమైన వారు, మెదడు సంబంధిత జబ్బులతో బాధపడేవారికి ఇది వరంగా మారుతోంది. ఇది కేవలం ఓ కమర్షియల్ సర్వీస్ కాదు… ఒక బాధను అర్థం చేసుకున్న సేవా తపన. అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, గృహవైద్యంలో ఈ సేవల వినియోగం పెరుగుతోంది. చిరునవ్వు పోయిన ముఖాలపై మళ్లీ వెలుగులు నింపే ప్రయత్నమే ఈ సేవ వెనుక ఉన్న అసలైన సంకల్పం అని చెబుతున్నారు డెంటిస్ట్ ఎట్ డోర్‌స్టెప్ ఏజెన్సీ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ అనితా నారాయణన్. ఇలాంటి పేషెంట్స్‌కు సర్వీస్ ఇవ్వడం ద్వారా ఎంతో మానసిక సంతృప్తి ఉంది అంటున్నారు ఆమె. డాక్టర్ అనిత నారాయణన్‌కు డెంటల్ ఫీల్డ్‌లో 22 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ‘డెంటిస్ట్ ఎట్ డోర్‌స్టెప్‌’ లాంచ్ చేసి.. సర్వీసు అందిస్తున్నారు.

“డెంటిస్ట్ ఎట్ డోర్ స్టెప్” అనే కాన్సెప్ట్ ఎలా ఆవిర్భవించింది? దీని వెనుక ఉద్దేశం ఏమిటి?

ఇది వ్యాపార ఆలోచనగా మొదలుకాలేదు. వాస్తవానికి చాలామంది రోగుల ఇబ్బందులు దగ్గర్నుంచి చూశాను. వాళ్లను క్లీనిక్‌కి తీసుకురావడం చాలా కష్టం అయ్యేది. అంబులెన్స్‌ ఏర్పాటు, వెయింటింగ్, ఫిజికల్ స్ట్రెస్ అన్నీ చూసినప్పుడు ఒక్క చిన్న ట్రీట్‌మెంట్ కోసం వారు ఎన్ని తిప్పలు పడుతున్నామో అర్థమైంది. అప్పుడే ఆలోచన వచ్చింది. వాళ్లు ఉన్నచోటే వైద్యం అందించడమే అసలైన పరిష్కారం అని భావించాను. అలాగే డిమెన్షియా, పార్కిన్సన్ లాంటి సమస్యలతో బాధపడే వారిని బయటకు తీసుకురావడమే సవాలవుతుంది. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు, క్లినిక్‌కి రమ్మని చెప్పడం కన్నా వాళ్ల ఇంటికే వెళ్లే వైద్యం అవసరమని స్పష్టమైంది. అదే ఆలోచనను సమర్థవంతమైన సేవగా మలచడానికి ‘డెంటిస్ట్ అట్ డోర్ స్టెప్’ అనే కాన్సెప్ట్‌ని ప్రారంభించాం. ఈ సందర్భంగా ఈ సర్వీసుకు సంబంధించినే పలు ప్రశ్నలకు సమాధానాలు ఆమె ద్వారానే తెలుసుకుందాం…

ఇది సాధారణ క్లినిక్ ట్రీట్‌మెంట్‌లకు ఏ విధంగా భిన్నంగా ఉంటుంది?

సాధారణంగా పేషెంట్లు డెంటల్ క్లినిక్‌కి వెళ్లాలి అంటే ట్రాఫిక్, వేయిటింగ్ టైం, ఒత్తిడి అన్నీ పెద్ద ఇబ్బందిగా మారతాయి. ముఖ్యంగా వృద్ధులు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు రిత్యా మంచానికే పరిమితమైనవారు, నడవలేని పేషెంట్లు క్లినిక్‌కి రావడం చాలా ఇబ్బందికరం. అలాంటివారి కోసం మేము అవసరమైన అన్ని పరికరాలతో, స్టెరిలైజేషన్‌తో, ట్రైన్డ్ డెంటిస్టులతో ఇంటికే వస్తాం. క్లినిక్‌కి వచ్చి చేసే ట్రీట్‌మెంట్‌నే ఇంట్లో కూడా అదే ప్రొటోకాల్‌తో, అదే నాణ్యతతో అందిస్తున్నాం. కానీ ఇక్కడ పేషెంట్‌కి మానసికంగా చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్లు తన ఇంట్లో, సొంత వాతావరణంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. అది వాళ్లకు మానసికంగా, శారీరకంగా ఓ మెరుగైన అనుభూతి ఇస్తుంది.

ఈ సేవలను ప్రజలు ఎలా బుక్ చేసుకోవచ్చు?

ప్రస్తుతం చాలా మంది మా సేవలను రెండు మార్గాల ద్వారా పొందుతున్నారు. ఒకవైపు ఆల్రెడీ చికిత్స తీసుకున్న కుటుంబాలు తమ సన్నిహితులకు, మిత్రులకు మమ్మల్ని రిఫర్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది ఇతర డాక్టర్లు కూడా తమ వృద్ధ పేషెంట్ల కోసం ఈ హోమ్ డెంటల్ కేర్‌ను సూచిస్తున్నారు. అదే సమయంలో మా అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉన్నాయి. అందులో కాంటాక్ట్ నంబర్లు, బుక్ చేసుకునే ఫారమ్‌ లింక్, అవసరమైన సమాచారం అన్నీ ఉంటాయి. ఎవరైనా అతి తేలికగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదా అందులోని కాంటాక్ట్ నంబర్లను సంప్రదించవచ్చు.

మీరు ఏయే పేషెంట్లకు, ఎలాంటి సేవలు అందిస్తారు..?

పేషెంట్ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ప్రతి కొన్ని నెలలకు ఒకసారి నిర్వహించే సమగ్ర దంత పరీక్షలు చేస్తాం. ప్యాలియేటివ్ కేర్ అంటే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులకు నొప్పి ఉపశమనం, నెమ్మదిగా ప్రత్యేక సేవలు అందిస్తాం. పార్కిన్సన్‌ రోగులకు నోటి శుభ్రత, మౌత్ కేర్ నిర్వహణ అందుబాటులో ఉంది. డిమెన్షియా రోగులకు మెమొరీ డిజార్డర్స్ ఉన్న వారికి అనుకూలమైన పద్ధతులు పాటిస్తాం. క్యాన్సర్‌ పేషెంట్లకు రేడియేషన్ లేదా కీమో వల్ల వచ్చే దంత సమస్యలకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ఫిజికల్‌గా డిపెండెంట్ పేషెంట్లు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు నెమ్మదిగా, నొప్పిలేని చికిత్స అందజేస్తాం. నోటి మొత్తాన్ని పూర్తిగా శుభ్రపరచడం, టార్టర్, ప్లాక్ తొలగించడం ద్వారా దంత సమస్యలకు చెక్ పెడతాం. ఇక సేవల విషయానికి వస్తే.. ఫుల్ మౌత్ క్లీనింగ్, ఎక్స్‌ట్రాక్షన్స్ పళ్లు తొలగించడం, పళ్లు మార్చడం వంటి సేవలు కూడా ఇంటి వద్దే అందిస్తాం.

ఇంటి వద్ద డెంటల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ఎలాంటి సాంకేతికత, పరికరాలు వాడుతున్నారు?

ఇంట్లోనే క్లినిక్ స్థాయి సేవలు అందించాలంటే, సాంకేతికంగా తగిన ఏర్పాట్లు ఉండాలి. అందుకే మేము ప్రతి హోమ్ విజిట్‌కి కూడా క్లినికల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ఈ పోర్టబుల్ ఎక్విప్‌మెంట్‌ను తీసుకెళ్తాం. పేషెంట్‌కు సౌకర్యవంతంగా కూర్చునే వీలుగా ఉండే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన తేలికపాటి డెంటల్ చెయిర్ ఉంటుంది. ఎక్కడైనా ఇది వినియోగించవచ్చు. అవసరమైన ఎయిర్ ప్రెజర్‌తో వర్కింగ్ టూల్స్‌కు పవర్ సపోర్ట్ ఇచ్చే విధంగా పోర్టబుల్ డెంటల్ కంఫ్రెసర్ ఉంటుంది. ఇది క్లినిక్ లెవల్ ట్రీట్‌మెంట్‌కి సరిపడే సామర్థ్యం కలిగి ఉంటుంది. పళ్లపై ఉన్న టార్టర్, ప్లాక్ తొలగించేందుకు ఉపయోగించే స్కేలింగ్ పరికరం అల్ట్రాసోనిక్ స్కేలర్ కూడా మాతో ఉంటుంది. ఫుల్ మౌత్ క్లీనింగ్ కోసం ఇది చాలా ముఖ్యమైనది. అలానే మా ఎక్విప్‌మెంట్‌లో హై పవర్ సక్షన్ యూనిట్ ఉంటుంది. చికిత్స సమయంలో పేషెంట్ నోటి లోపల ఏదైనా లిక్విడ్ లేదా మలిన పదార్థాలను వెంటనే తొలగించేందుకు ఉపయోగించే పరికరం ఇది. ఇది ఎక్కువగా మౌత్ క్లీనింగ్, ఎక్స్‌ట్రాక్షన్‌ల సమయంలో కీలకంగా ఉంటుంది.

మీ టీమ్‌లో ఎంతమంది డాక్టర్లు ఉంటారు? వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారా?

ప్రస్తుతం మా టీమ్‌లో సీనియర్ డెంటిస్టులు, అసిస్టెంట్ డెంటల్ సిబ్బంది కలిపి దాదాపు 10 మంది వరకు పనిచేస్తున్నారు. వీరందరూ డెంటల్ కళాశాలల నుండి ఉత్తీర్ణులై, రిజిస్టర్డ్ ప్రాక్టిషనర్లుగా పనిచేస్తున్నారు. అయితే ఇంటి వద్ద చికిత్స ఇవ్వడం అంటే కేవలం డెంటల్ స్కిల్‌తో సరిపోదు. ఇది పేషెంట్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మేము ప్రత్యేకంగా మా టీమ్‌కు ఇన్-హౌస్ ట్రైనింగ్ నిర్వహిస్తాము.

మీ సేవలు ప్రభుత్వ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా?

అవును, మా సేవలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాగుతున్నాయి. మేము అందిస్తున్న చికిత్సలన్నీ జీరియాట్రిక్ డెంటిస్ట్రీ పరిధిలోకి వస్తాయి. ఇది వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దంత వైద్య విభాగం. ఈ సేవలకు సంబంధించి నేషనల్ డెంటల్ కౌన్సిల్ సూచించిన నిబంధనలు, స్టెరిలైజేషన్ ప్రోటోకాల్‌లు, పేషెంట్ హ్యాండ్లింగ్ గైడ్‌లైన్స్‌ను పాటించడంతో పాటు, ఇంటి వద్ద చికిత్సకు అవసరమైన గైడ్‌లైన్స్ అనుసరిస్తున్నాం. మా లక్ష్యం క్లినిక్ లెవల్ నాణ్యతను ఇంటి వద్దే అందించడమే, కానీ పూర్తిగా నిబంధనలు పాటిస్తాం.

ఇప్పటివరకు మీరు అందించిన సేవలపై ప్రజల స్పందన ఎలా ఉంది?

ఇప్పటివరకు మేము దాదాపు 350కి పైగా హోమ్ విజిట్స్ చేశాము. ప్రతి కేసులో మేము పేషెంట్‌కి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా మానసికంగా ఎంతో రిలీఫ్ కలిగించగలిగాం. చాలా కుటుంబాలు మమ్మల్ని వేరే వాళ్లకు సజెస్ట్ చేస్తున్నారు. మేము అందించిన సేవల్లో నాణ్యత, పరిశుభ్రత, డాక్టర్ల ప్రొఫెషనలిజంపై ప్రత్యేకంగా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఇది మాకు మరింత బాధ్యతగా మారింది.

ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచన ఉందా?

అవును మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచన స్పష్టంగా ఉంది. ఇందుకోసం కొన్ని కొత్త లొకేషన్లలో డెంటిస్టుల టిమ్‌ను బిల్డ్ చేయడం, అవసరమైన ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాం. మా సేవలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్డేట్లు, స్పెషల్ క్యాంపెయిన్‌లు ఉన్నా… అవన్నీ మా వెబ్‌సైట్‌లోనూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నాం.

డెంటల్ టెలిమెడిసిన్, ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లతో మీ సేవల కలయిక ఎలా ఉంటుంది?

ఇంటి వద్ద చికిత్స అందించడంలో టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మేము పేషెంట్లకు ముందుగా ఒక వీడియో కన్సల్టేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. దాంతో వారి సమస్యను ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు, అసలు హోమ్ విజిట్ అవసరమా లేదా అనేది ముందే నిర్ణయించవచ్చు. అలానే ఇంటి వద్ద చికిత్స అనంతరం జరిగే ఫాలో-అప్ కోసం కూడా టెలికాన్సల్టేషన్ చాలా ఉపయోగపడుతోంది. చిన్న చిన్న సూచనల కోసం మళ్ళీ ఇంటికి రావలసిన అవసరం లేకుండా, వీడియో కాల్ ద్వారా తక్షణమే స్పందించగలుగుతున్నాం.

డెంటిస్ట్ ఎట్ డోర్‌స్టెప్‌ ఖర్చు పరంగా సాధారణ క్లినిక్ కంటే తక్కువ ఖర్చుతో వస్తుందా?

ఖర్చు పరంగా చూస్తే, ఇంటి వద్ద డెంటల్ ట్రీట్‌మెంట్ ధరలు మామూలు క్లినిక్‌ ధరలతో ఇంచుమించు సమానంగా ఉంటాయి. అయితే మేము వారి ఇంటి వరకు వెళ్లే ప్రయాణ ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మెట్రో సిటీల్లో ట్రాఫిక్, టైం వేస్ట్, వృద్ధుల వాహన ఏర్పాట్లతో పోలిస్తే మా ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు చాలా తక్కువే.

మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ మోడల్స్ అందిస్తున్నారా?

అవును.. ప్రస్తుతం మా వద్ద 4 సబ్స్క్రిప్షన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీరు దిగువన ఇమేజ్‌లో చూడవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే మమల్ని సంప్రదించవచ్చు.

ఈ సేవలు ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ వంటి ప్లాన్లతో కలిపి ఉపయోగించుకోవచ్చా?

ప్రస్తుతం మా సేవలు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థతో టై అప్ అవ్వలేదు. అయితే, పేషెంట్లు మా దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత, వారు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రకారం తగిన రసీదులు, చికిత్స వివరాలు తీసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఫైనల్‌గా మీరు చెప్పే మాట..?

ఇంట్లో చికిత్స అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. కానీ అందుబాటులో వైద్యులు తక్కువగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో ‘డెంటల్ కేర్ అట్ హోమ్’ సేవలు ఎంత అవసరమో మాకు పేషెంట్ల నుంచి స్పష్టంగా తెలుస్తోంది. నా చివరి మాట ఒక్కటే.. మరింతమంది డెంటిస్టులు ఈ దిశగా ముందుకు రావాలి.ఇది కేవలం ఒక ప్రాక్టీస్ మార్పు కాదు… ఒక ఆలోచన మార్పు. ఇలాంటి సేవల ద్వారా మనం చాలామందికి వైద్యంతో పాటు గౌరవం, భరోసా కూడా అందించగలం.

Dr. Anitha Narayanan

Dr. Anitha Narayanan With Her Patients

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *