సౌందర్య పోషణలో కీర దోస ముక్కలను రకరకాలుగా వినియోగిస్తారు. ముఖ్యంగా చాలా మంది కళ్ళపై వీటిని పెట్టుకుని రిలాక్స్ అవుతుంటారు. కీర దోస ముక్కలను కళ్ళపై పెట్టుకోవడం వల్ల కళ్ళు నిజంగా రిలాక్స్ అవుతాయా? లేదా? అనే సందేహం మీకూ ఉందా? ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..
కీర దోసలోని విటమిన్ సి, కెఫిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు కళ్ల వాపు తగ్గించడానికి, కళ్ళ కింద నల్లటి వలయాలను తేలికపరచడానికి సహాయపడతాయి. కీర దోస శీతలీకరణ ప్రభావం వాపును తగ్గిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌పై ఎక్కువసేపు పనిచేసిన తర్వాత కళ్ళపై కీర దోస ముక్కలను ఉంచడం వల్ల ఉపశమనం లభిస్తుంది. నల్లటి వలయాలను తొలగిస్తుంది.
దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు సిలికా కళ్ళ కింద చర్మాన్ని టోన్ చేయడానికి సహాయపడతాయి. ఇది తేమను అందిస్తుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కీర దోసను 15 నుంచి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో చల్లబరచాలి. తర్వాత దానిని రెండు రౌండ్లుగా కట్ చేసి కళ్ళపై ఉంచాలి. కళ్ళు మూసుకుని 10 నుంచి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
కీర దోసను కళ్ళపై పెట్టే ముందు బాగా కడగాలి. ఏవైనా అలెర్జీలు, చర్మం చికాకు సమస్యలు ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కీర దోస అలసట, వాపు నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే సహాయపడుతుంది.
అయితే తీవ్రమైన కంటి వ్యాధులున్న వారు ఉపయోగించకూడదు. ఇది కేవలం ఒక హోమ్ రెమెడీ మాత్రమే. కళ్ళు నిరంతరం మంటగా, వాపుగా, బాధాకరంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.