Cricket Records : వికెట్ల వెనుక మెరుపు వీరులు..అత్యధిక డిస్మిసల్స్ చేసిన టాప్-5 కీపర్లు వీరే

Cricket Records : వికెట్ల వెనుక మెరుపు వీరులు..అత్యధిక డిస్మిసల్స్ చేసిన టాప్-5 కీపర్లు వీరే


T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక డిస్మిసల్స్ (వికెట్ల వెనుక బ్యాటర్లను అవుట్ చేయడం) చేసిన వికెట్ కీపర్‌గా టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉండేవారు. అయితే ఫిబ్రవరి 9న కెనడాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండు క్యాచ్‌లు పట్టడం ద్వారా ధోనీ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ చెరో 32 డిస్మిసల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా, కెనడా జట్ల మధ్య జరిగిన పోరులో క్వింటన్ డికాక్ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెనడా ఓపెనర్లు దిల్‌ప్రీత్ బజ్వా, యువరాజ్ సామ్రాలు ఇచ్చిన క్యాచ్‌లను విజయవంతంగా అందుకున్న డికాక్.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తన 32వ డిస్మిసల్‌ను పూర్తి చేశాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (32 డిస్మిసల్స్) సరసన నిలిచాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ధోనీ ఈ రికార్డును 32 మ్యాచ్‌ల్లో సాధిస్తే, డికాక్ కేవలం 28 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకోవడం విశేషం.

టాప్-5లో కొనసాగుతున్న దిగ్గజాలు

ప్రస్తుతం అత్యధిక డిస్మిసల్స్ చేసిన జాబితాలో క్వింటన్ డికాక్ (32), ఎంఎస్ ధోనీ (32) అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన కామ్రాన్ అక్మల్ 30 డిస్మిసల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. విండీస్ కీపర్ దినేష్ రామ్దిన్ 27 పాయింట్లతో నాలుగో స్థానంలో, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 26 డిస్మిసల్స్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. ఇందులో డికాక్ మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్‌గా ఉండటంతో, రాబోయే మ్యాచ్‌ల్లో ఆయన ఈ రికార్డును తిరగరాసి ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

వికెట్ల వెనుక విన్యాసాలు

డికాక్ ఖాతాలో ఇప్పటివరకు 25 క్యాచ్‌లు, 7 స్టంపింగ్‌లు ఉన్నాయి. అదే సమయంలో ధోనీ ఖాతాలో 21 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఒకవేళ వచ్చే మ్యాచ్‌ల్లో డికాక్ మరో వికెట్‌ను తన కీపింగ్‌తో పడగొడితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్‌లో 100కు పైగా డిస్మిసల్స్ చేసిన ఏకైక కీపర్‌గా డికాక్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *