గతంతో పోలిస్తే ఈ మధ్య డబ్బింగ్ సినిమాల హవా కాస్త తగ్గింది. చాన్నాళ్ళ తర్వాత కూలీతో మళ్లీ అనువాద సినిమాలకు ఊపొచ్చేలా కనిపిస్తుంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు. పైగా లోకేష్ గత సినిమాలు ఖైదీ, విక్రమ్, లియో తెలుగులోనూ హిట్టవ్వడంతో.. బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ.
జైలర్‌తో రజినీ కూడా ఫామ్‌లోకి వచ్చారు. 2023లో విడుదలైన ఈ చిత్రం 12 కోట్ల బిజినెస్ చేస్తే.. 48 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మధ్యలో వేట్టయాన్ ఫ్లాపైనా.. కూలీకి డిమాండ్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
పైగా నాగ్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. కూలీ తెలుగు రైట్స్‌ను ఏషియన్ సునీల్ ఏకంగా 52 కోట్లకు కొన్నట్లు తెలుస్తుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ అవుతుందన్నమాట.
తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఒకే ఒక్క సినిమా కేజీయఫ్ 2. 2022లో వచ్చిన ఈ చిత్రం 138 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. దీని తర్వాత జైలర్ 83 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 2.0 కూడా 80 కోట్లు వసూలు చేసింది.. ఇక యానిమల్ 72 కోట్లు.. జవాన్ 60 కోట్లు.. అమరన్ 52 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి.
కూలీ బిజినెస్ గేమ్ రిస్క్‌తో కూడుకున్నదే. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. 100 కోట్లు కచ్చితంగా వసూలు చేయాల్సిందే. KGF 2కు మాత్రమే సాధ్యమైన 100 కోట్ల రికార్డ్ కూలీ కూడా అందుకోవాల్సిందే. మరోవైపు అదే ఆగస్ట్ 14న వార్ 2 కూడా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులో కూలీకి వార్ 2తో గట్టిపోటీ తప్పకపోవచ్చు. మొత్తానికి రిస్కీ గేమ్ ఆడుతున్నాడు కూలీ.