దగ్గు కొన్నిసార్లు 4 వారాల నుండి 8 వారాల వరకు కూడా ఉండవచ్చు. లక్షణాలు కనిపించిన మొదటి వారంలో మాత్రమే ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత వచ్చే దగ్గు వల్ల ఇతరులకు ముప్పు ఉండదని డాక్టర్ మోక్ స్పష్టం చేశారు. మరి దగ్గు ఎందుకు అంత కాలం కొనసాగుతుంది? ఏయే పరిస్థితుల్లో అది ప్రమాదకరంగా మారుతుంది? దీనిని తగ్గించుకునే మార్గాలు ఏంటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.
వైరస్ పోయినా దగ్గు ఎందుకు ఆగదు?
శరీరం నుండి వైరస్ బయటకు పోయినప్పటికీ, మన శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల శ్వాసనాళాలు సున్నితంగా మారుతాయి. దీనివల్ల చిన్న ధూళి కణం లోపలికి వెళ్లినా లేదా చల్లని గాలి తగిలినా వెంటనే దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, అలెర్జీ రినిటిస్ లేదా కడుపులో యాసిడ్ పైకి వచ్చే ‘GERD’ సమస్య ఉన్నవారిలో ఈ దగ్గు ఎక్కువ కాలం వేధిస్తుంది.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
దగ్గు 8 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే దానిని ‘దీర్ఘకాలిక దగ్గు’ (Chronic Cough)గా పరిగణించాలి. యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ మార్గదర్శకాల ప్రకారం.. దగ్గుతో పాటు కింది లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
ఛాతీలో తీవ్రమైన నొప్పి.
దగ్గుతున్నప్పుడు రక్తం పడటం.
కారణం లేకుండా బరువు తగ్గిపోవడం.
తీవ్రతను తగ్గించుకునే చిట్కాలు:
హైడ్రేషన్: గొంతు పొడిబారకుండా ఉండటానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
షుగర్-ఫ్రీ క్యాండీ: నోటిలో షుగర్-ఫ్రీ మిఠాయిని ఉంచుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి అయి, గొంతులో దురదను తగ్గించి దగ్గును అరికడుతుంది.
దుమ్ముకు దూరం: ధూమపానం మానేయడంతో పాటు, కాలుష్యం, పొగ మరియు దుమ్ము ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
వైద్య చరిత్ర: మీ పాత అనారోగ్య సమస్యలను బట్టి దగ్గు మందులు వాడటం శ్రేయస్కరం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆరోగ్యం విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.