బుద్ధి కారకుడు బుధుడు ఈ నెల(జులై) 20 నుంచి ఆగస్టు 12 వరకు కర్కాటక రాశిలో వక్రించడం జరుగుతోంది. బుధుడు వక్రగతి పట్టడం వల్ల ఆదాయం పెరగడానికి, ఆకస్మిక ధన లాభానికి, ఆర్థిక, గృహ ఒప్పందాలు కుదరడానికి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని తప్పటడుగులు వేయడానికి, పొరపాట్లు చేయడానికి కూడా అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు కొద్ది రోజుల పాటు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తరచూ గణపతి స్తోత్ర పఠనం వల్ల భారీ తప్పిదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, ఆస్తిపాస్తులు సమకూరడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఇంట్లో శుభ కార్యాలు జరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ వక్రగతి వల్ల ఆర్థిక వ్యవహారాల్లో మోసపోవడం, గృహ, వాహన, ఆస్తి ఒప్పందాల్లో చిక్కుల్లో పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. అతి ఆత్మవిశ్వాసం వల్ల దెబ్బతినడం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
- కర్కాటకం: ఈ రాశిలో బుధ సంచారం వల్ల సమయస్ఫూర్తి, తెలివితేటలు, నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి. అయితే, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. బంధువుల వల్ల మోసపోయే లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. మిత్రుల్లో కొందరు శత్రువులుగా మారతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బంది పడతారు.
- తుల: ఈ రాశికి దశమంలో ఉన్న బుధుడు వక్రించడం వల్ల విదేశాల్లో ఉద్యోగానికి ఆఫర్లు అందుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు లభిస్తాయి. తండ్రి వల్ల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది. బంధువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. అనవసర వాదోపవాదాలకు అవకాశం ఉంది. మాట తొందరకు అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధుడు వక్రగతి పట్టడం వల్ల విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. షేర్ల, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. అయితే, కొన్ని ముఖ్యమైన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. తప్పుదారి పట్టించే మిత్రులతో కొద్దిగా నష్టపోతారు. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి.
- మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ వక్ర సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. విదేశీయానానికి మార్గం సుగ మం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అయితే, ఈ వక్రగతి వల్ల దంపతుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అనవసర పరిచయాల్లో చిక్కుకుంటారు. ఆర్థిక విషయాల్లో బాగా నష్టపోవడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడి వక్ర సంచారం వల్ల ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. అయితే, ఏ విషయంలోనూ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బంధుమిత్రులను అపార్థం చేసుకుంటారు. నష్టదాయక వ్యవహారాలు పెరుగుతాయి.