బుద్ధ హస్తాన్ని బుషుకాన్ అని కూడా పిలుస్తారు. ఈ బుద్ధ హస్తం ఒక సిట్రస్ పండు. అంటే విటమిన్ సితో నిండి ఉంటుంది. దీని రంగు నిమ్మ తొక్క కలర్లో ఉంటుంది. ఇది మంచి సువాసనగల పండు. జామ్, మార్మాలాడే ఈ పండు నుండి తయారు చేస్తారు. బుద్ధ హస్తం నుండి పెర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తారు. బుద్ధ హస్తం అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బుద్ధ హస్తం పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన పండులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, సిలతోపాటు ఫైబర్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ బుద్ధ హస్తం పండులో ఫ్లేవనాయిడ్స్, కౌమరిన్స్, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్లు, వయస్సు మీద పడడం వల్ల వచ్చే రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. నొప్పులను తగ్గించేందుకు ఈ పండును ఔషధంగా ఉపయోగిస్తారు.
ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. స్త్రీలు రుతు సమయంలో ఈ పండ్లను తింటే పలు రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
ఈ పండులో కౌమారిన్, లైమోనిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనాల్జెసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నొప్పులను తగ్గిస్తాయి. వాపుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పండ్లను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.