భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకునే పనిలో ఉంది. దీని తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. గత సంవత్సరం అంతర్గత ఎన్నికలు ప్రారంభమైనప్పుడు, పార్టీ 10కి పైగా కొత్త రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకుంది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికలు నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా 2020 నుండి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2023లో ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీని నడిపించడానికి బిజెపి ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆ సమయం రానే వచ్చింది. బిజెపికి నయా బాస్ వచ్చే సమయం అసన్నమైంది. అయితే ఈ సారి తమ జాతీయ అధ్యక్ష బాధ్యతలు మహిళకు అప్పగించాలని బీజేపీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..
నిర్మలా సీతారామన్..
బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి ముందు వరుసలో ఉన్న అభ్యర్థులలో బిజెపి నాయకురాలు నిర్మలా సీతారామన్ ఒకరు. ఎందుకంటే ఆమె పార్టీలో అత్యంత ప్రభావవంతమైన మహిళ. ఆమె 2019 నుండి ఆర్థిక మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడులో ఆమె మూలాలు కూడా బిజెపికి అనుకూలంగా ఉంటాయి. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడతారనే ఆలోచన పార్టీలో ఉంది. ఈ పరిణామాల మధ్య సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో జెపి నడ్డా, బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌లతో సమావేశమయ్యారు.
పురందేశ్వరి..
ఇక బిజెపి జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మరో వ్యక్తి బిజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ మాజీ చీఫ్ డి పురందేశ్వరి. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్‌లలో ఉగ్రవాద వ్యతిరేక వైఖరికి ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వ ఆపరేషన్ సిందూర్ ప్రతినిధి బృందంలో ఆమె కూడా ఒకరు.
వానతి శ్రీనివాసన్
బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి ప్రచారంలో ఉన్న మూడవ పేరు వానతి శ్రీనివాసన్. ఆమె బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2021లో ఆమె నటుడు, మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌ను ఓడించి తమిళనాడులోని కోయంబత్తూర్ (సౌత్) స్థానంలో గెలుపొందారు. ఆమె 1993 నుండి బిజెపితో అనుబంధం కలిగి ఉన్నారు. 2022లో బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
మహిళా అధ్యక్షురాలే ఎందుకు?
ఇటీవలి కాలంలో మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలో పార్టీ విజయం సాధించినందున, జాతీయ అధ్యక్ష పదవికి మహిళా అభ్యర్థి కోసం బిజెపి వెతుకుతోంది. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించాలని చూస్తున్నందుకు ఇదే ఒక కారణమని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా బిజెపి ముందుకు తెచ్చింది. ఇది పార్లమెంటు ఉభయ సభలను క్లియర్ చేసింది. ఈ బిల్లు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కోరుతుంది. పార్టీకి మహిళా అధ్యక్షురాలిని నియమించడం వల్ల మహిళా బిల్లుపై మరింత గట్టిగా మాట్లాడే వీలుంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి