BCCI : భారత క్రికెట్‌లో కీలకమైన బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారీ మార్పులు జరుగుతున్నాయి. కోచింగ్ సిబ్బందిలో చాలామంది వెళ్లిపోవడంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ రాజీనామా చేయగా, సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా తన పదవిని వదిలేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఖాళీగా ఉన్న కోచ్ పదవుల కోసం వెతుకుతోంది. ఇటీవల, బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీతో పాటు, మరికొందరు కోచ్‌లు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో, బీసీసీఐ బ్యాటింగ్, బౌలింగ్, మెడికల్, స్పోర్ట్స్ సైన్స్ విభాగాల్లోని ఉన్నత పదవుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ కీలక సమయంలో ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో, భారత క్రికెట్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి పలువురు కోచ్‌లు రాజీనామా చేశారు. బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రాయ్ కూలీ మూడేళ్ల కాంట్రాక్ట్ పూర్తవడంతో నిష్క్రమించారు. అతని స్థానంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వీఆర్‌వీ సింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, మెడికల్ టీమ్ హెడ్ నితిన్ పటేల్ మార్చిలో రాజీనామా చేశారు. స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ స్టాఫ్‌లో చేరారు. జనవరి 2025లో భారత నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సితాంషు కోటక్ కూడా గతంలో సీఓఈలోనే పనిచేశారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీ కాలం కూడా ఈ ఏడాది చివరిలో ముగుస్తోంది. లక్ష్మణ్ తన పదవీ కాలాన్ని పొడిగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని మీడియా నివేదికలు చెబుతున్నాయి. బీసీసీఐ 2027 వరల్డ్ కప్ వరకు ఆ పదవిలో కొనసాగాలని కోరినా, ఆయన ఒప్పుకునే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది.
బీసీసీఐ ప్రధానంగా మూడు ముఖ్యమైన పదవుల కోసం అభ్యర్థులను ఆహ్వానించింది. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌గా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గతంలో ఫస్ట్ క్లాస్ లేదా అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండాలి. వారికీ బీసీసీఐ లెవల్ 2 లేదా 3 కోచింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. బ్యాటింగ్ కోచ్‌కి కనీసం 5 సంవత్సరాల కోచింగ్ అనుభవం, బౌలింగ్ కోచ్‌కి కూడా అంతే అనుభవం అవసరం. స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్‌గా దరఖాస్తు చేసుకునేవారికి స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటు, ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 20.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..