Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. దాదా వ్యాఖ్యలు విన్న క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏడాది క్రితం చివరి మ్యాచ్ ఆడిన ఒక బౌలర్‌కు ఇప్పుడు ఆసియా కప్‌లో అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఆ బౌలర్ ఎవరు, గంగూలీ ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాడో ఈ వార్తలో తెలుసుకుందాం.
గంగూలీ డిమాండ్ వెనుక కారణాలు
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి మొదలవుతుంది. ఈ టోర్నమెంట్‌కు ముందు, టీమిండియాలో కొత్త ఆటగాళ్ల ఎంపికపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ, ఇండియా టుడేతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.
ముకేశ్ కుమార్‌కు ఛాన్స్ దక్కేనా
గంగూలీ మాట్లాడుతూ.. “ముకేశ్ కుమార్‌కు తప్పకుండా మరో అవకాశం ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో అతను ఒక మంచి ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్‌లో చాలా బాగా రాణించాడు. అతనికి మళ్లీ ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు టీమిండియా టెస్టులు ఆడటం లేదు కాబట్టి, టీ20లు లేదా ఆసియా కప్‌లో అతనిని తప్పకుండా తీసుకోవాలి. అతను అన్ని ఫార్మాట్‌లకు సరిపోయే బౌలర్. అతని సమయం వస్తుంది, కానీ ఓపికతో ఉండాలి” అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ముకేశ్ కుమార్ పర్ఫామెన్స్
ముకేశ్ కుమార్ 2023లో వెస్టిండీస్‌తో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. అతను ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌ల్లో 24.35 సగటుతో 20 వికెట్లు తీశాడు. అదేవిధంగా, 6 వన్డేలలో 5 వికెట్లు, 3 టెస్టుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ చివరిసారిగా జూలై 14, 2024న జింబాబ్వేపై మ్యాచ్ ఆడాడు.
రీఎంట్రీ కష్టమే?
గంగూలీ ముకేశ్ కుమార్ కోసం డిమాండ్ చేసినప్పటికీ, అతను టీమిండియాలోకి తిరిగి రావడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. ఇటీవలి కాలంలో దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అనేకమంది యువ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ముకేశ్ కుమార్‌కు మళ్లీ చోటు దక్కడం కష్టంగా మారింది.
ఆసియా కప్ షెడ్యూల్
ఆసియా కప్ 2025లో భారత జట్టు మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది. తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 29న దుబాయ్‌లో జరుగుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..