Arshdeep Singh : భారత జట్టుకు వైట్-బాల్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఇప్పుడు ఒక చారిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో జట్టులో భాగమైనప్పటికీ ఈ లెఫ్ట్-ఆర్మ్ పేసర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. అయితే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం అతని ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ఆసియా కప్ 2025లో ఈ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
అర్ష్‌దీప్ సింగ్ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో 99 వికెట్లు సాధించారు. ఇంకొక వికెట్ తీస్తే టీ20 ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది కాబట్టి, ఈ రికార్డును టోర్నమెంట్ ప్రారంభ దశలోనే సాధించే అవకాశం ఉంది. 25 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో అతను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 17 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో కీలకమైన బౌలింగ్ వేయగల అతని కెపాసిటీ అతన్ని భారత జట్టుకు ఒక మంచి బౌలర్‌గా మార్చింది.
టీ20 క్రికెట్‌లో భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. హార్దిక్ పాండ్యా 94 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ 164 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024 సంవత్సరం నుంచి టీ20 క్రికెట్‌లో డెత్ ఓవర్లలో (చివరి ఓవర్లలో) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 18 ఇన్నింగ్స్‌లలో 18 వికెట్లు తీసి ఈ రికార్డును సాధించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన టస్కిన్ అహ్మద్ 18 ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరొక బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ 20 ఇన్నింగ్స్‌లలో 15 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన మహీష్ తీక్షణ 15 ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 5న ప్రారంభమై, సెప్టెంబర్ 28న ముగుస్తుంది. ఈ టోర్నమెంట్‌లో అర్ష్‌దీప్ ఈ రికార్డును మాత్రమే కాకుండా, మరిన్ని వికెట్లు తీసి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..