అమరావతి, ఆగస్ట్ 8: రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామకాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) త్వరితగతిన ఏర్పాట్లు చేస్తుంది. తాజాగా ఉ్యదోగ నియామకాలకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల మెరిట్లిస్ట్ను విడుదల చేసింది. ఎంపిక చేసిన అభ్యర్థుల అర్హతల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 19, 2025న జరగనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఎంపికైన అభ్యర్ధులకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కమిషన్ అధికారిక వెబ్సైట్లో పొందు పరచినట్లు కమిషన్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ఆర్జీయూకేటీల్లో స్పోర్ట్స్, ఎన్సీసీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని బాసర, మహబూబ్నగర్ ఆర్జీయూకేటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా కింద పీయూసీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు బాసర ఆర్జీయూకేటీ ఇన్ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ జాబితాను విడుదల చేశారు. వీరితోపాటు ఐదో విడత జనరల్ కోటాలో పెంపికైన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. వీరందరికీ ఆగస్టు 8వ తేదీన బాసరలో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని ఆయన సూచించారు.
ఆగస్టు 11 నుంచి బడి పిల్లలకు ఫార్మెటివ్-1 పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఫార్మెటివ్ 1 పరీక్షలు ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఆగస్టు 11 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 11 నుంచి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 6,7,8 తరగతులకు ఉదయం 9.30 నుంచి 10.45 వరకు, అలాగే మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు పరీక్షలు ఉంటాయి. ఇక 9, 10 తరగతులకు ఉదయం 11 నుంచి 12.15 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.45 నుంచి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.