AP RTE 2026 Admissions: నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ చదువులు.. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP RTE 2026 Admissions: నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ చదువులు.. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం


విద్యా హక్కు చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికిగానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు ఆర్టీఈ నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటన వెలువరించారు. ఈ నోటిఫికేషన్‌ కింద సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 20, 2026వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం, లేదా సంబంధిత పాఠశాల నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సందేహాలకు టోల్‌ఫ్రీ నంబరు 18004258599కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని సూచించారు.

అయితే ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందగోరే పిల్లలు తప్పనిసరిగా సీబీఎస్సీ స్కూళ్లకైతే 2020 ఏప్రిల్‌ 2 నుంచి 2021 మార్చి 31లోపు జన్మించి ఉండాలి. అంటే ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. ఇక రాష్ట్ర సిలబస్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు 2020 జూన్‌ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలి. అలాగే ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్, ఓటరు, రేషన్‌ కార్డులు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, విద్యుత్తు బిల్లు వంటి వాటిని ప్రామాణికంగా సమర్పించవల్సి ఉంటుంది. వీటితోపాటు పిల్లల వయసు ధ్రువీకరణకు బర్త్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారిస్తారు. మార్చి 25న మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ ఉంటుంది. ఇక ఏప్రిల్‌ 12న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడించి.. ఏప్రిల్‌ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధృవీకరణ పూర్తి చేస్తారు. కాగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో నిరు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆయా స్కూళ్లు 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తారు. ఆర్టీఈ కింద ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *