అమరావతి, ఆగస్టు 2: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని సబ్జెక్టు పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. తాజాగా మరో కీలక అప్‌డేజ్ జారీ చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ చేసి తుది ఆన్సర్ కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఫలితాలను కూడా వెల్లడిస్తామని విద్యాశాఖ పేర్కొంది. తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లో డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే వారం రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఏపీ మెగా డీఎస్సీ 2025 తుది కీ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా మొత్తం 16,347 ఉద్యోగాల భర్తీకి జూన్ 6 నుంచి జులై 2 వరకు విద్యాశాఖ ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్లు జరిగితే ఎంపికైన అభ్యర్ధులకు ఆగస్టు 15 నాటికి నియామక పత్రాలు అందజేస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖలో ఇటీవల 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా ఆగస్టు 5వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో పెన్ను, పేపర్ పద్ధతిలో జరనుంది. ఇదే శాఖకు చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి కూడా తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. FSO పోస్టులకు త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.