సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంలో సిట్ నివేదికపై మరోసారి మంత్రి మండలి చర్చించింది. ఇక ఏపీలో AI లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు విషయంలో NVIDIAతో భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు, తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి పీపీపీ మోడల్‌లో అనుమతి ఇవ్వడంతో పాటు, రామాయపట్నం పోర్ట్ రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీలో కీలక మార్పులు, నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వార్డులు, సచివాలయాల పేర్లను ‘స్వర్ణ వార్డు’, ‘స్వర్ణ సచివాలయాలు’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతినిచ్చారు. దీనికింద ఏడాదికి ఎకరాకు 30 వేల రూపాయల కౌలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక జల జీవన్ మిషన్ కింద ఏపీకి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్రానికి చేసిన సూచనలకు సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీశైలం ఘటనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. శ్రీశైలంలో భక్తుల రద్దీ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం చర్చించారు. వృద్ధులను క్యూ లైన్ల నుంచి బయటకు తెచ్చే సమయంలో జరిగిన గొడవ గురించి చంద్రబాబు స్పందించారు. శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు సీఎం. అయితే అసలు విషయం తెలియకపోవడంతో, వాళ్లను వేరే దారిలో తీసుకు వెళ్తున్నారని భక్తులు భావించారని హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు. అలాంటప్పుడు భక్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా, మైక్ ద్వారా ముందే అనౌన్స్ చేసి వివరిస్తే బాగుండేదన్నారు ముఖ్యమంత్రి.
ఇక కేబినెట్ భేటీలో అజెండా అంశాలు ముగిశాక, వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. మంత్రులంతా అసెంబ్లీకి సబ్జెక్ట్‌పై ప్రిపేర్ అయి రావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతిపక్షం లేదు కదా అని ఏదో ఒకటి సభలో చెబుదాం అనే ధోరణి వీడాలని మంత్రులకు సూచించారు. అసెంబ్లీ ముగిశాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రులు తమతమ పేషీల్లోనే ఉండి, ఎమ్మెల్యేలను కలిసి వాళ్ల సమస్యలు పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి. సభలో మంత్రులు చెప్పే సమాధానాలు కూడా క్లుప్తంగా, అర్థమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు. ఇక అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రులు, శాసన సభ్యుల నివాస సముదాయాలను పరిశీలించాలని సీఎం సూచించారు. గతంలో ఇదే విషయాన్ని చెప్పినా, ఎంతమంది మంత్రులు సందర్శించారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.