ఓయో రూమ్స్.. అతితక్కువ కాలంలో ఎక్కువ పాపులర్ అయ్యింది. నగరాల్లో రూమ్స్ కావాలంటే ఫస్ట్ చూసేది ఓయో రూమ్స్. చిన్న చిన్న పట్టణాలకు సైతం ఓయో విస్తరించింది. అందుబాటులో రేట్లు ఉండడం కూడా ప్రజలు ఆకర్షితులు అవడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇప్పుడిది అడవుల వరకు విస్తరించనుంది. అవును హోమ్ హట్స్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టే, హోమ్ హట్స్ నిర్మించనుంది. పర్యాటకులకు గ్రామీణ జీవితం యొక్క అసలైన ఫీల్ అందించడం, గిరిజన కుటుంబాలకు కొత్త సంపాదన అవకాశాలను సృష్టించడం దీని ఉద్దేశ్యం. గిరిజన వర్గాలలో స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రయత్నాలలో ఈ ఒప్పందం భాగం.
కాఫీ సాగుకు ప్రోత్సాహం
కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు టాటా కంపెనీ ముందుకొచ్చింది. అంతేకాకుండా పాడేరు ఐటీడీఏతో ఐటీసీ ఒప్పందం చేసుకుంది. దీని కింద 1,600 హెక్టార్ల భూమిలో కాఫీని సాగు చేస్తారు. ఇప్పటికే 4,010 హెక్టార్ల భూమిలో కాఫీ సాగు జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడానికి, ముఖ్యంగా అధిక నాణ్యత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించడానికి కాఫీ బోర్డు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
గిరిజన మహిళలకు అండగా..
గిరిజన మహిళలకు సాయం చేయడానికి ఈజీ మార్ట్ ముందుకొచ్చింది. గిరిజన ప్రాంతాల్లో మహిళలు తయారుచేసిన స్థానిక ఉత్పత్తులను మార్కెంటింగ్ చేయనుంది. అటు ఈక్విప్ సంస్థ ఐటీడీఏతో ఓ ఒప్పందం చేసుకుంది. గిరిజన గ్రామాల్లో సుపు సాగును ప్రోత్సహించనుంది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలను సృష్టించడం జరుగుతుంది.
గిరిజన టూరిజం సర్క్యూట్ అభివృద్ధి
ఐటీడీఏతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. గిరిజన మహిళా సంఘాలు తయారు చేసే కాలానుగుణ అటవీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చింది. అదే సమయంలో ది ఛేంజ్ సొసైటీ గిరిజన విద్యార్థులకు మంచి విద్యతో పాటు నైతిక విద్య పెంపొందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, గ్రామీణ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక స్థిరమైన జీవనోపాధి నమూనాలను సృష్టించడానికి అనేక ఒప్పందాలు జరిగాయి. ఏపీ టూరిజం శాఖ కూడా గిరిజన పర్యాటక సర్క్యూట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. తద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో ఉపాధి పెరుగడంతో పాటు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..