రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నిరంతరం పనిచేసే రాష్ట్ర హోమ్ మినిష్టర్ సాధారణ రైతులా మారి పొలాల్లో వరినాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లాలో పర్యటనలో భాగంగా మంత్రి అనిత గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి బయలుదేరారు. అలా గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కన పొలంలో నాట్లు వేస్తున్న రైతులను చూసి వెంటనే ఆగారు. నాట్లు సాగుతున్న సమయంలోనే రాష్ట్ర హోమ్ మంత్రి అనిత కారు దిగి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా అందరినీ పలకరించారు. అక్కడ నుండి అతికష్టం మీద పొలం గట్లపై నడుస్తూ పొలంలోకి దిగారు. అక్కడ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూనే.. కూలీలతో కలిసి వరి నాట్లు వేయడం ప్రారంభించారు.
సాధారణంగా రాజకీయ నాయకులు సభల్లో ప్రసంగాలు, సమావేశాలకే పరిమితం అవుతారు. కానీ అనిత మాత్రం రైతుల కష్టాలను అర్థం చేసుకోవడానికి వారితో కలిసి మమేకమై.. కొంతసేపు గడిపారు. వరినాట్లు వేస్తూ సందడి చేశారు.

Home Minister Vangalapudi Anitha
వీడియో చూడండి..
అయితే.. హోంమంత్రి అనిత.. తన హోదాను పక్కనపెట్టి తమతో కలిసి వరి నాట్లు వేయడం పట్ల రైతులు, కూలీలు హర్షం వ్యక్తం చేశారు.. రైతులు తమ కష్టాలను పంచుకుంటుంటే, ఆమె శ్రద్ధగా విని వెంటనే అధికారులను పిలిచి అవసరమైన సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమ్ మంత్రి సాధారణ రైతులతో కలిసిపోయి పనిచేయడం చూసి అంతా ఆనందపడ్డారు. తమ సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించడం తమకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని రైతులు, కూలీలు పేర్కొన్నారు. ఈ ఘటనతో అనిత గ్రామస్థుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా రైతుల్లో ఒకరిలా మారి వారి సమస్యలు తెలుసుకోవడం పై జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..