త్రివేణి, లక్ష్మీ ఇద్దరూ స్నేహితులు.. గుంటూరు నగరంలోని తారకరామ నగర్ కు చెందిన త్రివేణి.. గుజ్జనగుండ్లకు చెందిన లక్ష్మీ మధ్య స్నేహ బంధం ఉంది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అయితే త్రివేణి తన బంగారు ఆభరణాలతో డబ్బులు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చింది. అయితే ఈ విషయం తన భర్తకు చెప్పకుండా దాచింది. కొద్దీ రోజుల తర్వాత పవన్ కుమార్ బంగారు ఆభరణాలు గురించి ఆరా తీశాడు. అయితే ఆ నగలు తన స్నేహితుడైన రంజిత్ కు ఇచ్చినట్లు త్రివేణి తన భర్త పవన్ కుమార్ కు చెప్పింది. త్రివేణి చెప్పింది నిజమా.. అబద్దమా? అని తెలుసుకునేందుకు పవన్ కుమార్ వెంటనే రంజిత్ కు ఫోన్ చేసి నగలు గురించి అడిగాడు. దీంతో కంగారు పడిపోయిన రంజిత్.. త్రివేణి ఆభరణాలు కుదవ పెట్టి ఆ డబ్బులు ఆమె స్నేహితురాలైన లక్ష్మీకి ఇచ్చినట్లు చెప్పాడు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా లక్ష్మీ తల్లి అంజమ్మకు చేరింది. దీంతో ఆమె అగ్గిలం మీద గుగ్గిలం అయింది. తన కుమార్తె లక్ష్మీని చెడామడా తిట్టింది. ఇటువంటి విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని ప్రశ్నించింది. తల్లి చెప్పినా వినకుండా తిడుతుండటంతో లక్ష్మీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. అయితే తన స్నేహితురాలి తప్పేమి లేదని చెప్పేందుకు త్రివేణి వాళ్ల ఇంటికి వచ్చి వాళ్ల అమ్మ అంజమ్మతో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే త్రివేణి ఇంటికి వచ్చిన సమయంలో లక్ష్మీ లేకపోవడం, త్రివేణిని చూసిన కోపంలో అంజమ్మ ఇద్దరిని కలిసి తిడుతుండటంతో ఆగ్రహానికి లోనైన త్రివేణి అంజమ్మపై చేయి చేసుకుంది.
అంజమ్మ చెంపలపై త్రివేణి గట్టిగా కొట్టడంతో పళ్లు కూడా రాలిపోయాయి. ఆ దెబ్బకు కింద పడిపోయిన అంజమ్మ ప్రాణాలు విడిచింది. దీంతో కంగారు పడిపోయిన త్రివేణి స్నేహితురాలికి ఫోన్ చేసింది. వెంటనే లక్ష్మీ ఇంటికి వచ్చింది. తన తల్లి చనిపోయిన విషయాన్ని చెప్పకుండా దాచే ప్రయత్నం లక్ష్మీ చేసింది. అయితే బంధువులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో త్రివేణి కొట్టడంతోనే తల్లి చనిపోయినట్లు ఒప్పుకుంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేయడంతో లక్ష్మీ స్నేహితురాలిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..