అమరావతికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అమరావతికి రూ.1500 కోట్ల సాయం ప్రకటించింది. ప్రత్యేక సాయంగా వీటిని ప్రకటించింది. గత జనవరి వరకు అమరావతికి ఏకంగా రూ.750 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ పరిమళ్ సత్వానీ అడిగిన ప్రశ్నకు ఆర్ధికాఖ సహాయమంత్రి పంకచ్ చౌధరి సమాధానమిచ్చారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందనే ప్రశ్నగా.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. దీంతో పాటు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ది బ్యాంకుల ద్వారా ఏపీకి రూ.5,120 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతికి నిధులు
2025-26 బడ్జెట్‌లో అమరావతికి రూ.15 వేల కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటివరకు బ్యాంకుల నుంచి రూ.7,245 కోట్ల సాయాన్ని అందించింది. గత కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన దానిలో దాదాపు 90 శాతం ఇప్పటికే విడుదల చేసింది. ఇక మిగిలిన 10 శాతం ప్రత్యేక నిధులను గ్రాంట్ కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అందించనుందని కేంద్ర సహాయమంత్రి పంకజ్ చౌధరి స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన నిధులను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతికి సాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే అమరావతి అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతుండటంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రులతో భేటీ
కాగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు హస్తిన పర్యటనలో ఉన్న సమయంలోనే కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామాన్, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అమిత్ షాతో జరిగిన భేటీలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్దత తీసుకురావడంపై చర్చించారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు కేబినెట్‌లో బిల్లుకు ఆమోదం తెలిపాక పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది.