AI Fertility: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐవీఎఫ్ ఫెయిలైనా ఏఐ సాయంతో తల్లైన మహిళ

AI Fertility: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐవీఎఫ్ ఫెయిలైనా ఏఐ సాయంతో తల్లైన మహిళ


ఈ దంపతులకు బిడ్డలు కలగకపోవడానికి కారణం అజోస్పెర్మియా. ఈ అరుదైన పరిస్థితిలో పురుషుడి వీర్యంలో శుక్రకణాలు అస్సలు ఉండవు. సాధారణ ఆరోగ్యకరమైన వీర్య నమూనాతో పోలిస్తే లక్షల సంఖ్యలో శుక్రకణాలు ఉండాలి. ప్రతి తలుపు తట్టి విసిగిపోయిన ఆ దంపతులు చివరగా కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (CUFC)ను ఆశ్రయించారు. అక్కడ స్టార్ పద్ధతిని ఉపయోగించారు. దాగివున్న శుక్రకణాలను గుర్తించడానికి ఏఐ ని వాడారు. ఇదే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

ఫెర్టిలిటీ సెంటర్‌లోని పరిశోధకులు ఏఐ సాయంతో వీర్య నమూనాని పరిశీలించి, దాగి ఉన్న శుక్రకణాలను కనుగొన్నారు. వాటిని తిరిగి పొందాక, ఆ శుక్రకణాలను ఉపయోగించి భార్య అండాన్ని ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరించారు. ఈ స్టార్ పద్ధతితో గర్భం దాల్చిన తొలి మహిళగా ఆమె నిలిచారు.

“నేను గర్భవతిని అని నమ్మడానికి రెండు రోజులు పట్టింది. ప్రతీ ఉదయం నిద్రలేవగానే ఇది నిజమా కాదా అని నమ్మలేకపోతున్నా. స్కాన్‌లు చూసే వరకు నేను గర్భవతిని అని నాకు నమ్మకం కుదరడం లేదు,” అని ఆ మహిళ సంతోషం వ్యక్తం చేస్తోంది.

స్టార్ పద్ధతి అంటే..?

CUFC డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ తన బృందంతో ఐదేళ్ల పరిశోధన అనంతరం స్టార్ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి నిజ జీవితంలో ఫలితాలు ఇవ్వడంతో ఆయన బృందం కూడా ఆశ్చర్యపోయింది.

“ఒక రోగి నమూనా ఇచ్చారు. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు రెండు రోజులు ఆ నమూనాలో శుక్రకణాల కోసం వెతికారు. ఒక్కటి కూడా దొరకలేదు. మేము AI ఆధారిత స్టార్ సిస్టమ్ వద్దకు ఆ నమూనాను తెచ్చాం. గంటలోనే అది 44 శుక్రకణాలను గుర్తించింది. అప్పుడే మేము ‘వావ్, ఇది నిజంగా గేమ్-ఛేంజర్. ఇది రోగులకు చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది’ అని గ్రహించాం,” అని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన విలియమ్స్ అన్నారు.

వీర్య నమూనాను ప్రత్యేకంగా రూపొందించిన చిప్‌పై మైక్రోస్కోప్ కింద ఉంచాక, స్టార్ సిస్టమ్ అధిక శక్తి గల ఇమేజింగ్‌ను ఉపయోగించి మొత్తం వీర్య నమూనాని స్కాన్ చేస్తుంది. గంట లోపు ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ చిత్రాలు తీస్తుంది. ఆ తర్వాత, శుక్రకణాలను గుర్తించేలా శిక్షణ పొందిన ఏఐ, ప్రత్యుత్పత్తి కణాన్ని గుర్తిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *