అదానీ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2035 నాటికి సుమారు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడం లక్ష్యంగా కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఈ మొత్తంలో ఎక్కువ భాగం పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్ల నిర్మాణానికి వినియోగించనుంది. కంపెనీ ప్రకారం.. ఈ చొరవ భారతదేశాన్ని AI టెక్నాలజీ వినియోగదారుడిగా మాత్రమే కాకుండా, ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశంగా కూడా ఎదిగేలా చేస్తుంది.
గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులు సర్వర్ తయారీ, క్లౌడ్ సేవలు, అనుబంధ రంగాల్లో మరో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఫలితంగా 2035 నాటికి భారత్‌లో 250 బిలియన్ డాలర్ల విలువైన AI మౌలిక సదుపాయాల ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డేటా సెంటర్ అంటే ఏమిటి?
డిజిటల్ యుగంలో డేటా నిల్వ, ప్రాసెసింగ్, భద్రత కోసం ఉపయోగించే సమగ్ర వ్యవస్థను డేటా సెంటర్ అంటారు. గతంలో ఇవి ఒకే భవనంలో సర్వర్ల సమాహారంగా ఉండేవి. ఇప్పుడు ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌లుగా మారాయి. భౌతిక సర్వర్లు, వర్చువల్ మిషన్లు, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎడ్జ్ లొకేషన్లు కలిసి ఆధునిక డేటా సెంటర్‌ను రూపొందిస్తాయి. క్లౌడ్ నిల్వ సేవలను Amazon Web Services, Google Cloud, Microsoft Azure వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఇవి కంపెనీలకు మౌలిక సదుపాయాల నిర్వహణ భారాన్ని తగ్గిస్తాయి.
AI డేటా సెంటర్ల ప్రత్యేకత
AI డేటా సెంటర్లు అధిక శక్తి గల GPUలు, TPUలు ఉపయోగించి భారీ డేటాను వేగంగా ప్రాసెస్ చేస్తాయి. మెషిన్ లెర్నింగ్, రియల్ టైమ్ అనలిటిక్స్ వంటి ఆధునిక అప్లికేషన్లకు ఇవి కీలకం. గ్రీన్ ఎనర్జీతో నడిచే డేటా సెంటర్లు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. డేటా సెంటర్లు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. బ్యాంకింగ్, ఈ-కామర్స్, హెల్త్‌కేర్, ప్రభుత్వ సేవలు వంటివి డేటా సెంటర్లపై ఆధారపడి ఉంటాయి. భౌతిక, సైబర్ భద్రతా వ్యవస్థలు డేటాను రక్షిస్తాయి. మొత్తం మీద అదానీ గ్రూప్ పెట్టుబడులు భారతదేశాన్ని AI రంగంలో ప్రపంచ స్థాయి శక్తిగా నిలబెట్టే దిశగా కీలకంగా మారనున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి