తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని చిత్తు చేయడమే టార్గెట్‌గా ఈగల్ టీమ్‌లు డేగ కన్నేసి దాడులు చేస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి సమూల ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్లతో పెడ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా దొరికినోళ్లను దొరికినట్లు మడతపెట్టేస్తోంది ఈగల్ టీమ్. అయితే.. ఇటీవల దాడుల్లో ఓ సంచలన డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించింది. హైదరాబాద్‌లోని కాలేజీలే అడ్డాగా విద్యార్థులే కస్టమర్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలడం నివ్వెరపోయేలా చేస్తోంది. డ్రగ్స్ పట్టుబడేది పబ్బులు, గబ్బుపట్టిన ప్రదేశాలని ఇన్నాళ్లూ భావించాం.. కానీ.. మెజార్టీ డ్రగ్స్ పట్టుబడుతోంది.. వాటికి బానిసలవుతోంది స్టూడెంట్సే అన్న విషయంలో ప్రకంపనలు రేపుతోంది. అది కూడా వాళ్లు చదువుతున్న కాలేజీల్లోకే డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నాయని ఈగల్ టీమ్ దాడుల్లో బయటపడడం షాకిస్తోంది. డ్రగ్స్‌కు సంబంధించిన ఆయా పరిణామాలు.. ప్రభుత్వ వర్గాలతోపాటు.. పేరెంట్స్‌లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.
ఓ మెడికల్ కాలేజ్ గంజాయి కేసుతో కదిలిన డొంక
డ్రగ్స్ డెన్స్‌గా కాలేజీలు ఎలా మారాయి.. ఎందుకు మారాయి..?.. అనే విషయాలపై మరింత లోతైన ఇంటర్నల్ ఎంక్వైరీతో ఈగల్ టీమ్.. మత్తులో చిత్తవుతున్నవారి గుట్టురట్టు చేసింది. ఒకప్పుడు స్టూడెంట్ దమ్ము కొట్టడాన్ని ఓ ఫ్యాషన్‌గా భావించేవాడు. కానీ.. నేటి స్టూడెంట్ సిగరెట్‌లో గంజాయి దూర్చి దమ్ముకొట్టడం ఫ్యాషన్‌గా భావిస్తున్నాడు. అంతేకాదు.. ర్యాంగింగ్ పేరుతో సీనియర్స్ సైతం.. జూనియర్స్‌కు ఇదే అలవాటు చేయడం పేరెంట్స్‌ను కంగారు పెట్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ పరిధిలోని ఓ మెడికల్ కాలేజ్‌లో విద్యార్థులు గంజాయి సేవిస్తున్న వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అయింది.
ఉస్మానియా ఆస్పత్రిలో డ్రగ్స్‌కు బానిసైన ఆరుగురు వైద్యులు
సీనియర్ విద్యార్ధులు గంజాయి విక్రయిస్తున్నట్లు ఈగల్ టీమ్ ఆపరేషన్‌లో బయటపడింది. మెడిసిటీ కాలేజీ స్టూడెంట్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తేలింది. అంతేకాదు.. ఈగల్ టీమ్ దర్యాప్తులో అనేక కాలేజీల్లో గంజాయి దందా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా పెట్రేగిపోతున్నట్లు బట్టబయలు అయింది. ఇక్కడ విచారించాల్సిన విషయం.. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దాంతో.. వారిపై చర్యల కోసం భారత వైద్య మండలికి లేఖ రాశారు ఈగల్ టీమ్ అధికారులు.
ఈగల్ టీమ్ దాడుల్లో మత్తు పదార్ధాల గుట్టురట్టు అయిన కాలేజీల లిస్ట్ ఇదే..
గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇండస్ కాలేజ్, జేఎన్‌టీయూ కాలేజ్, జోగిపేట, బాసర ట్రిపుల్ ఐటీ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, సింబయోసిస్ కాలేజీ, కలినరీ అకాడమీ, కుందన్ బాగ్ కాలేజీల్లో మత్తు పదార్థాల గుట్టు రట్టయింది.
విద్యార్థుల విషయంలోనూ నో కాంప్రమైజ్
ఇక.. విద్యా సంస్థల్లో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ఈగల్ అధికారులు కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దాంతో.. గతంలో విద్యార్థుల ఐడెంటిటీ రివిల్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు.. ఇప్పుడు విద్యార్దుల పేర్లను కూడా వెల్లడిస్తూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. విద్యార్ధులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలేజ్ యాజమాన్యాన్ని కూడా బాధ్యులను చేసేలా రూల్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ఈగల్ టీమ్. మొత్తంగా.. ఇకపై డ్రగ్స్ వ్యవహారంలో తగ్గేదేలే అంటోంది తెలంగాణ ఈగల్ టీమ్. ఎంతటివారైనా గుట్టురట్టు అవ్వాల్సిందే అనే రేంజ్‌లో విరుచుకుపడుతోంది. అంతేకాదు.. ఇటీవల డ్రగ్స్ కేసుల్లో విద్యార్థులు భారీగా పట్టుబడుతుండడంతో వారి విషయంలోనూ నో కాంప్రమైజ్ అంటోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన యాజమాన్యాలు.. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..