హైదరాబాద్ నగరాభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నగరాభివృద్ధి ప్రణాళికలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖ ద్వారంగా ఓఆర్ఆర్‌పై గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మించాలని చెప్పారు.
వరల్డ్ క్లాస్ జోన్‌గా బాపూఘాట్ చుట్టు ఉన్న ఏరియా
ఓఆర్ఆర్‌కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి..మరోవైపున బాపూ ఘాట్‌వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని చెప్పారు ముఖ్యమంత్రి. అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్ క్లాస్ జోన్‌గా అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. గాంధీ సరోవర్ చుట్టూ ఈ ప్లైఓవర్ కనెక్టివ్ కారిడార్‌లా ఉండాలని అధికారులకు సూచించారు.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్‌కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు.
గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తయిన ఐకానిక్ టవర్
గాంధీ సరోవర్ దగ్గర నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తయిన టవర్‌గా నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ మేరకు సాధ్యా సాధ్యాలు పరిశీలించాలని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఎత్తున నిర్మించాలనేది అంచనాకు రావాలని సూచించారు. తాగు నీటితో పాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఉండాలని, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్ట్ నమూనాలు పరిశీలించాలని చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగు నీటిని హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్ధంగా వినియోగించుకునేలా ప్లానింగ్ చేయాలన్నారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..