
అమరావతి, ఆగస్టు 10: రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ప్రస్తుతం అన్ని రకాల నోటిఫికేషన్లు కలిపి 18 వరకు జారీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 12కుపైగా నోటిఫికేషన్లు క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవి ఉన్నాయి. అయితే పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. జిల్లా సైనిక వెల్ఫేర్, వ్యవసాయ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ శాఖ), టెక్నికల్ అసిస్టెంట్ (గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్), డ్రాఫ్ట్స్‌మెన్- గ్రేడ్-2 (ఫారెస్టు), హార్టీకల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (ఫిషరీస్), రాయల్టీ ఇన్స్పెక్టర్ (మైన్స్), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్-కం-టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పరీక్షా కేంద్రాల లభ్యతను అనుసరించి రాత పరీక్ష కేంద్రాలను ఖరారు చేస్తారు. ఈ తేదీలపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్లు జారీ చేస్తారు. మొత్తం 18 నోటిఫికేషన్లలో ఒక నోటిఫికేషన్లో అత్యధికంగా 4 పోస్టులు ఉన్నాయట. దీనిని బట్టి చూస్తే పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఆగస్టు 12న ఎస్ఎస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల లింక్ ఇదే
స్టాఫ్ సెలక్షన్ కమీషన్.. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష ఆగస్టు 12న ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. స్వంత స్క్రైబ్ ఎంపిక చేసుకున్న అభ్యర్థుల వివరాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అడ్మిట్ కార్డ్, స్క్రైబ్ ఎంట్రీ పాస్‌లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కాగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. మొత్తం 437 ఖాళీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.