టెంపుల్ సిటీ తిరుపతి పవిత్రత దెబ్బతింటోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తమ మొక్కులు సమర్పించుకునేందుకు.. తిరుమల వెళ్తుంటే.. వారికి తిరుపతిలోనే విషాహారాన్ని తినిపించేస్తున్నారు కొందరు. తిరుమల వెళ్లాలంటే.. ముందు తిరుపతిలో దిగాల్సిందే. అక్కడి కాస్త సేదదీరి.. భోజనం చేసి.. తిరుమల బయల్దేరుతారు. కొందరైతే ఇక్కడే విడిదిని ఏర్పాటు చేసుకుని తిరుమల వెళ్లివస్తుంటారు. అయితే తిరుపతిలోని హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్ల పరిస్థితి ఎప్పుడైనా గమనించారా? వాటిలో దుర్గంధం మేటలు వేసింది. కల్తీ పొరలు కట్టింది. దీంతో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్త దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
వెంకన్న సన్నిధి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. తిరుపతి-తిరుమలను ఎవరూ వేర్వేరుగా చూడరు. తిరుపతి చేరుకున్నామంటేనే ఆధ్యాత్మికత బయటకు వస్తుంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే ప్రాంతం తిరుపతి. శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులతో రద్దీగా ఉండే టెంపుల్ సిటీలో కల్తీ ఆహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. భక్తులకు రమ్యంగా స్వాగతం పలుకుతున్నా.. ఈ హోటల్స్ , రెస్టారెంట్స్ మాత్రం కంటిలో నలుసులా.. కాలికి ముల్లులా తయారయ్యాయి. రెండు రోజులుగా ఫుడ్‌సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు 20 టీమ్స్‌గా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. తొలి రోజు 30కి పైగా హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఆహార భద్రత, తూనికలు కొలతల శాఖ అధికారులు సోదాలు చేశారు. చాలా హోటల్స్‌లో కల్తీ ఆహారాన్ని గుర్తించారు. అంతేకాదు.. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. రీనెస్ట్ హోటల్‌లో జరిపిన తనిఖీల్లో కుళ్ళిపోయి బూజు పట్టిన మాంసం బయటపడింది. వెంటనే అధికారులు మాంసాన్ని సీజ్‌చేసి ల్యాబ్‌కు పంపారు. హోటల్‌కు నోటీసులు జారీచేశారు. చాలా హోటల్స్‌లో ముందురోజు తయారుచేసిన బిర్యానీ, కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. అంతేకాదు.. కొన్ని పాన్‌షాపుల్లో 3-4 రోజుల క్రితం తయారుచేసిన కిళ్లీలను గుర్తించి.. సీజ్ చేశారు.
ఇక రెండో రోజు బేకరీలు, స్వీట్ స్టాల్స్, తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో రెండో రోజు కూడా 20 టీమ్స్ గా ఏర్పడి సంయుక్త దాడులు చేపట్టారు. రేణిగుంటలోని FB ఫుడ్స్, ఇండస్ట్రియల్ ఏరియాలోని క్యూటీ ఫ్రూటీ పరిశ్రమల్లో దాడులు నిర్వహించారు. తయారీ విధానాన్ని, వాడుతున్న ముడిసరుకులు, రసాయనాలు, రంగులపై ఆరా తీసిన అధికారులు ఎలాంటి లైసెన్సులు లేకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అసలు లైసెన్సులకే అప్లై చేయకుండా ఆహారపదార్థాల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన రంగుల వాడడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో తయారీపై యజమానులను నిలదీశారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.
ఇక రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఫ్రూట్ కేవ్స్ పరిశ్రమలో ఎలాంటి ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. శాంపిల్స్ సేకరించి నోటీసులు జారీ చేశారు. పరిమితికి మించి రంగులు, ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారని గుర్తించారు. మరోవైపు ప్యాకింగ్ లోనూ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేల్చచారు.