ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. కేంద్రమంత్రి బండి సంజయ్. కార్యకర్తలు, నేతలు వెంటరాగా భారీ ర్యాలీగా దిల్‌కుశ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. ఈ కేసులో బండి సంజయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిట్ విచారణకు హాజరయ్యే ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే ఈ అంశంలో CBI విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. BRS హయాంలో అత్యధికంగా తన ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను కేంద్ర మంత్రి సెట్ అధికారులకు సమర్పించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, మంత్రి పీఆర్ఓ పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ముందు హాజరయ్యారు. ఇదిలావుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా పరిగణిస్తోంది. సిట్ విచారణ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా కూడా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. కేసీఆర్‌ను జైలులో పెడతామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కేంద్ర నిఘా సంస్థల నుండి కీలకమైన సమాచారాన్ని సేకరించారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్‌ను విస్తృతంగా ట్యాప్ చేసిందని నిఘా సంస్థలు నిర్ధారించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఫోన్ నిరంతరం ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంపై కేంద్ర నిఘా సంస్థలు ఆధారాలు సేకరించాయి. నిఘా సంస్థల నుండి సేకరించిన ఆధారాలను కేంద్ర మంత్రి సిట్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, మునుగోడు ఉప ఎన్నికల టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అప్పుడే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ కొన్ని ఆధారాలు అందజేశారంటున్నారు. సిట్ బృందానికి ఆధారాలు ఇవ్వడమే కాదు.. కేసును CBIకి అప్పగించాలని కూడా ఇప్పుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ట్యాంపిగ్ కేసును జాతీయ స్థాయిలో పెద్ద అంశంగా తీసుకోవాలనుకుంటోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. నాడు SIB చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు టీమ్ చాలా మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిందన్నదీ ఆరోపణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..