Richest Cricketers : భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతం. ఈ క్రీడలో లభించే పాపులారిటీ, స్టార్‌డమ్ చాలామంది ఆటగాళ్లకు కోట్లు సంపాదించే అవకాశాన్ని ఇచ్చింది. కేవలం మైదానంలో ఆట ద్వారానే కాకుండా, ఐపీఎల్ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు మరియు పెట్టుబడుల ద్వారా వీరు తమ సంపదను అనూహ్యంగా పెంచుకున్నారు. ది క్రికెట్ పాండా నివేదిక ప్రకారం, భారతదేశంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో మొదటి 7 స్థానాల్లో ఎవరున్నారో, వారి సంపాదన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సచిన్ టెండూల్కర్
క్రికెట్ అభిమానులకు దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా ఉన్నారు. ఆయన సంపాదన కేవలం క్రికెట్ ఆటతోనే ఆగిపోలేదు. అడిడాస్, కోకా-కోలా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక ఒప్పందాలు, సొంత దుస్తుల బ్రాండ్ ట్రూ బ్లూ, ఎస్ఆర్టి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి వ్యాపారాల ద్వారా ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1,416 కోట్లు (170 మిలియన్ డాలర్లు)గా అంచనా. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు.
2. మహేంద్ర సింగ్ ధోనీ
క్రికెట్ మైదానంలో తన అసాధారణమైన కెప్టెన్సీతో మహేంద్ర సింగ్ ధోనీ, సంపాదనలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఆయన ఐపీఎల్ జీతం కోట్లల్లో ఉంది. దీనితో పాటు రీబాక్, గల్ఫ్ ఆయిల్, సొనాటా వంటి బ్రాండ్లతో బ్రాండ్ డీల్స్, చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫుట్‌బాల్ టీమ్‌లో పెట్టుబడులు, స్పోర్ట్స్‌ఫిట్ ఫిట్‌నెస్ చైన్ వంటి వాటి ద్వారా ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.917 కోట్లు దాటింది.
3. విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ ప్రస్తుత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ, మైదానంలో తన దూకుడు ఆటతీరుతో పాటు, స్మార్ట్ బ్రాండింగ్‌తో సంపాదనలో దూసుకుపోతున్నారు. పుమా, ఆడి, ఎంఆర్ఎఫ్ వంటి బ్రాండ్లతో కోట్ల రూపాయల ఒప్పందాలు, అలాగే ఆర్‌సీబీతో ఐపీఎల్ ఒప్పందం ద్వారా ఆయన భారీగా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా, చిసెల్ జిమ్ చైన్, డబ్ల్యూఆర్ఓఎన్జీ వంటి దుస్తుల బ్రాండ్‌లలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు. విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.834 కోట్లు (100 మిలియన్ డాలర్లు)గా అంచనా.
4. సౌరవ్ గంగూలీ
భారత జట్టుకు గెలుపుపై ఆశ, దూకుడు నేర్పించిన మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆటతో పాటు ఆట వెలుపల కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పెప్సీ, పుమా, టాటా వంటి కంపెనీలతో ఎండార్స్‌మెంట్‌లు, బీసీసీఐ అధ్యక్షుడిగా, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన సంపాదన ఎన్నో రెట్లు పెరిగింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.667 కోట్లుగా అంచనా.
5. వీరేంద్ర సెహ్వాగ్
తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన వీరేంద్ర సెహ్వాగ్, అంతర్జాతీయ క్రికెట్ తర్వాత కూడా వ్యాపారంలో మంచిగానే రాణిస్తున్నారు. కామెంటరీ, కోచింగ్ మరియు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఆయన భారీగా సంపాదించారు. అడిడాస్, బూస్ట్ వంటి బ్రాండ్లతో ఆయన చాలా కాలం పనిచేశారు. ప్రస్తుతం ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.334 కోట్లుగా అంచనా.
6. యువరాజ్ సింగ్
కేవలం క్రికెట్‌తోనే కాకుండా, తన వ్యాపార దార్శనికతతో కూడా యువరాజ్ సింగ్ బాగా సంపాదించారు. పుమా, పెప్సీ, రెవిటల్ వంటి బ్రాండ్లతో పని చేయడంతో పాటు, ఆయన స్థాపించిన యువీక్యాన్ వెంచర్స్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.292 కోట్లుగా అంచనా.
7. సునీల్ గవాస్కర్
భారత క్రికెట్‌కు తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన సునీల్ గవాస్కర్, క్రికెట్ తర్వాత కామెంటరీ, మీడియా రంగాల్లో సుదీర్ఘ కాలం కొనసాగారు. థమ్స్ అప్, దినేష్ వంటి బ్రాండ్లతో ఆయన పాత ఒప్పందాలు, టీవీ కార్యక్రమాలలో ఆయన నిరంతర హాజరు ఆయన సంపాదనను నిలబెట్టుకున్నాయి. 74 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.262 కోట్లుగా అంచనా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..