
ప్రస్తుతం ఒక ప్రేమికుడికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రేమికుడి తాను ప్రేమించిన యువతికి ద్రోహం చేయలేదు. ఆమెని హత్య చేయలేదు. పిచ్చిగా ప్రేమించి తాను ప్రేమించిన యువతి మరణించిన తర్వాత కూడా ఆమె మృతదేహంతో చాలా సంవత్సరాలు గడిపాడు. 1931లో 22 ఏళ్ల ఎలెనా డి హోయోస్కు టిబి వచ్చింది. ఆమెను చికిత్స కోసం ఫ్లోరిడాలోని మెరైన్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ఆమె రేడియోలాజిక్ టెక్నీషియన్ అయిన కార్ల్ టాంజ్లర్‌ను కలిసింది. అతను తనను తాను కౌంట్ కార్ల్ వాన్ కోజెల్ అని పరిచయం చేసుకున్నాడు.
అంతేకాదు ఎలెనాతో తాను చిన్నప్పుడు కలలో నల్లటి జుట్టు గల స్త్రీని చూశానని.. అప్పటి నుంచి ఆమెని ప్రేమిస్తున్నానని.. ఆమె తన ప్రేమికురాలు అని టాంజ్లర్ పేర్కొన్నాడు. తన కలలో కనిపించిన యువతి లక్షణాలు నీలో చూశానని ఎలెనాతో చెప్పాడు.
ఎలెనాను కాపాడటానికి కార్ల్ టాంజ్లర్ వింత చికిత్సలను ప్రయత్నించాడు. ఆమెకు తన ఇంట్లో తయారుచేసిన టానిక్స్, విద్యుత్ ఉపకరణాలతో చికిత్స చేసేవాడు. ఒక రోజు ఎలెనా ముందు తన ప్రేమని వ్యక్తపరిచాడు, అయితే ఎలెనా అతని ప్రేమని రిజెక్ట్ చేసింది. ఎప్పుడూ అంగీకరించలేదు. చివరికి టీబీ వ్యాధితో ఎలెనా 25 అక్టోబర్ 1931న మరణించింది.
అప్పుడు ఎలెనా అంత్యక్రియలకు ఖర్చులు భరించి, తన సొంత ఖర్చుతో సమాధిని నిర్మించాడు. దీంతో ఎలెనా సమాధి తాళాలు అతని వద్ద ఉన్నాయి. ప్రతి రోజూ రాత్రి సమాధిని సందర్శించడం ప్రారంభించాడు. రకరకాల బహుమతులు సమాధి దగ్గర పెట్టేవాడు. ఆమెతో మాట్లాడేవాడు. అంతేకాదు సమాధిలోని ఆమెతో మాట్లాడేందుకు టెలిఫోన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలెనా ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు.
ఇలా ఎలెనా మరణించి రెండేళ్ళు గడిచాయి. 1933లో అంటే ఎలెనా మరణించిన రెండు సంవత్సరాల తర్వాత కార్ల్ టాంజ్లర్ ఎలెనా శవాన్ని ఎవరికీ తెలియకుండా సమాధి నుంచి వెలికితీసి తన ఇంటికి తీసుకుతెచ్చుకున్నాడు. ఈ శవంతో ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆమె బతికి ఉన్నట్లే భావించేవాడు.
ఎలెనా శవాన్ని భద్రపరిచాడు. కోటు హ్యాంగర్లు , వైర్ ఉపయోగించి ఎముకలను జాయింట్ చేసి మనిషి రూపాన్ని ఇచ్చాడు. ముఖాన్ని మైనం, ప్లాస్టర్‌తో పునర్నిర్మించాడు. కళ్ళలో గాజు కళ్ళను పెట్టాడు. ఎలెనా నిజమైన జుట్టుతో ఒక విగ్‌ను తయారు చేశాడు. అతను పెర్ఫ్యూమ్, రసాయనాలతో శవం నుంచి దుర్వాసన రాకుండా చేశాడు. ఎలెనా శవాన్ని మనిషికి అలంకరించినట్లు నగలు వేసి అలంకరించాడు. ఆ శవాన్ని మంచం మీద తనా పక్కనే పెట్టుకున్నాడు. ఇలా ఏడు సంవత్సరాలు గడిపాడు. 1940లో.. ఎలెనా సోదరికి కార్ల్ బిహేవియర్ పై అనుమానం వచ్చింది. కార్ల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఎలెనా శవం వికృతంగా ఉన్నప్పటికీ చక్కని దుస్తులు ధరించిన ఎలెనా శవాన్ని గుర్తించింది. దీంతో కార్ల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కార్ల్ టాంజ్లర్ సమాధి నుంచి శవాన్ని దొంగిలించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. అయితే చట్ట ప్రకారం అతనిపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయబడలేదు. అయితే ఆశ్చర్యకరంగా ఆ సమయంలో అమెరికన్ ప్రజలు టాంజ్లర్‌ను నిజమైన ప్రేమికుడిగా భావించారు. వార్తాపత్రికలలో అతన్ని “విషాద ప్రేమికుడు”గా చిత్రీకరించి ఎన్నో వార్తలని ప్రచురించారు. దీంతో ఎలెనా మృతదేహం అందరినీ ఆకర్షించింది. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఆ శవాన్ని ప్రదర్శనకు పెట్టారు. వేలాది మంది ఆ శవాన్ని చూశారు. తరువాత ఎవరూ ఆమెను మళ్ళీ బయటకు తీయలేని విధంగా రహస్య సమాధిలో ఖననం చేశారు.
1952లో కార్ల్ టాంజ్లర్ మరణించాడు. అతను మరణించే సమయంలో కూడా అతని వద్ద ఎలెనాను పోలిన పెద్ద బొమ్మ ఉందని చెబుతారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..