మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేసి ఉన్న ఒక రైలు భోగిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బోగి పూర్తిగా దగ్ధమైంది. అందులో నిద్రిస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే పార్కింగ్ చేసి ఉన్న బోగిలో మంటలు ఎలా చెలరేగాయి..! ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా..? లేక షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పాట్‌కు చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదం శుక్రవారం(ఆగస్టు 8) తెల్లవారు జామున కేసముద్రం రైల్వే స్టేషన్‌లో జరిగింది. మూడవ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదే లైన్‌పై ఒక భోగిని పార్కింగ్ చేసి ఉంచారు. ఇక్కడ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులంతా ప్రతిరోజు ఆ బోగీలోనే నిద్రిస్తుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భోగిలో మంటలు చెలరేగి ఒక్కసారిగా బోగి మొత్తం వ్యాపించాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భోగి మొత్తం పూర్తిగా దగ్ధమైంది.
అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే విచారణ జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి రెండు కాకపోతే ఏదైనా మంటలు చెలరేగే పదార్థాలు, పేలుడు పదార్థాలు అందులో నిల్వ ఉంచి ఉండవచ్చు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి రైల్వే సిబ్బంది తోపాటు పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..