Warangal: ఒక్కసారిగా కుంగిన బ్రిడ్జి.. ములుగు – వరంగల్ మధ్య రాకపోకలు బంద్..!

Warangal: ఒక్కసారిగా కుంగిన బ్రిడ్జి.. ములుగు – వరంగల్ మధ్య రాకపోకలు బంద్..!


వరంగల్-ములుగు మధ్య జాతీయ రహదారి 163 పై ప్రధాన బ్రిడ్జి కుంగిపోయింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలన్నీ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం ఏర్పడింది.

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి కుంగిపోయింది. జాతీయ రహదారి 163 పై ఎస్సార్‌ఎస్పీ కెనాల్ వద్ద నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుంగింది. వంతెనకు ఒకవైపు ఒరగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇసుక లారీల ఓవర్ లోడ్ వల్లే ఈ బ్రిడ్జి కుంగిందని స్థానికులు చెబుతున్నారు..

చర్ల, వాజేడు, వెంకటాపురం ఏటూరునాగరం మండలాల నుండి వస్తున్న వేలాది ఇసుక లారీలు ఈ మార్గం మీదుగానే వరంగల్‌కు చేరుకుంటాయి. ప్రతిరోజు సుమారు మూడు వేల ఇసుక లారీలు రావడానికి కేవలం ఇదొక్కటే ప్రధాన రహదారి. ఓవర్ లోడ్ ఇసుక లారీల వల్ల ప్రధాన రహదారిపై చాలా ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఈ బ్రిడ్జికి కూడా ముప్పు పొంచి ఉందని గతంలో అనేక సందర్భాలలో ఇంజనీరింగ్ అధికారులు కూడా హెచ్చరించారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం సంభవించింది. కళ్ళ ముందే ఆ బ్రిడ్జి ఒకవైపు కుంగి పోవడంతో ఈ మార్గంలో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది..

ఓవర్ లోడ్ ఇసుక లారీలను నియంత్రించడంలో అధికారుల వైఫల్యం ఇప్పుడు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారింది.. మల్లంపల్లి వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో ములుగు వైపు వెళ్లే వాహనాలను గుడెప్పహాడ్, పరకాల, రేగొండ, అబ్బాపూర్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా వాహనదారులకు అదనంగా ఇప్పుడు 50 కిలోమీటర్ల భారం పడే అవకాశం ఉంది..

అయితే త్వరలో మేడారం మహా జాతర ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది. జాతరకు వేల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో వస్తుంటాయి. ఈలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారా..? లేక చేతులెత్తేస్తారని ఆందోళన రేకెత్తిస్తుంది. బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా మంత్రి సీతక్క ఆ రహదారి నిర్మాణ గుత్తేదారు తోపాటు సంబంధిత అధికారులను హుటాహుటిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ప్రత్యామ్నాయ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత కూడిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే ఓవర్‌లోడ్ ఇసుక లారీలను నియంత్రించాలని జిల్లా అధికారులు, పోలీసులు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *