హైదరాబాద్, జూన్ 25: హైదరాబాద్ మహానగరంలో గురువారం (ఆగస్టు 7) రాత్రి వాన దంచికొట్టింది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. వర్షం ధాటికి పలు బస్తీలు, కాలనీలు, రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గంట వ్యవధిలోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌లో 11.13, సరూర్‌నగర్‌లో 10.6, ఉప్పల్‌లో 9.5, షేక్‌పేట్‌లో 9, ఉప్పల్ న్యూనాగోల్‌లో 8, బండ్లగూడలో 8, దిల్‌సుఖ్‌నగర్‌లో 8.2, లింగోజిగూడలో 7.6, మలక్‌పేట్ ఆస్మాన్‌గఢ్‌లో 7.6 సెం.మీ.. ఇతర ప్రాంతాల్లోనూ 7 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.
పంజాగుట్ట, అమీర్‌పెట్, అబిడ్స్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, రాంనగర్, అల్వాల్, హబ్సిగూడ, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో కిలోమీటర్లమేర రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల నుంచి ఉక్కపోతకు నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా కురిసిన భారీ వర్షంతో కాస్త ఉపశమనం లభించినట్లైంది. అయితే ప్రయాణికులకు, వాహనదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద సముద్రమట్టం నుంచి 5.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. ప్రస్తుతం కర్ణాటక తీర ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక దక్షిణ రాయలసీమ ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ బంగాళాఖాతం వరకు ద్రోణి. కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు (ఆగస్టు 8) తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు హైదరాబాద్ తోపాటు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.