విజయవాడ, ఆగస్ట్ 8: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్, స్టేట్ కోటా ప్రవేశాలకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు తొలి విడత కౌన్సెలింగ్ జులై 21 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు 18వ తేదీలోగా ఆయా కాలేజీల్లో చేరాలని పేర్కొంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 21వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 29వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబరు 5వ తేదీలోగా ఆయా మెడికల్ కళాశాలల్లో చేరాలని పేర్కొంది.
మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 25వ తేదీలోగా సీట్లు పొందిన సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని వెల్లడించింది. మిగిలిన సీట్లకు స్ట్రే కౌన్సెలింగ్ సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబరు 4వ తేదీ వరకు ఈ కౌన్సెలింగ్‌కు అవకాశం ఇస్తారు. అక్టోబరు 10వ తేదీలోగా సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24, రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 11, మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 30, మాప్ అప్ రౌండు అక్టోబరు 10వ తేదీలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ను రూపొందించింది. ఇక సెప్టెంబరు 5వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 57 మంది అభ్యర్థులు హాజరుకాగా, మెడికల్ బోర్డులో వైకల్య పరీక్షలకు మొత్తం 28 మంది దివ్యాంగ అభ్యర్ధులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.