రాజస్థాన్‌లోని జైపూర్ నగరానికి చెందిన యువకుడు రాహుల్ ప్రజాపత్ తన ప్రియురాలి కోసం చేసిన వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయాలన్న ఆశతో ప్రజల దగ్గర డొనేషన్ అడుగుతున్న తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా డొనేషన్ అంటే అనారోగ్య చికిత్స, విద్య ఖర్చులు లేదా సామాజిక సేవల కోసం అడుగుతారు. కానీ ఈ యువకుడు మాత్రం తన వ్యక్తిగత ఆనందం కోసం, అది కూడా ప్రేమ కోసం అవసరానికి డబ్బులు కోరుతూ ప్రజల ముందుకొచ్చాడు. జైపూర్‌లోని పత్రికా గేట్, వరల్డ్ ట్రేడ్ పార్క్, గౌరవ్ టవర్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో HELP ME- గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగాలి, డొనేషన్ చేయండి అనే వాక్యంతో కూడిన పోస్టర్లు అతికించడంతో అక్కడ వచ్చే పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ పోస్టర్లపై అతను యూపీఐ క్యూఆర్ కోడ్‌ను కూడా జత చేశాడు. దీని వల్ల కొంతమంది జాలితో స్కాన్ చేసి చిన్న మొత్తాల్లో డబ్బు పంపించినట్టు తెలుస్తోంది. అతడి బ్యాంక్ ఖాతా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌దిగా సమాచారం. ఈ ప్రయోగం కొందరికి హాస్యంగా అనిపించగా, మరికొందరు యువత మాత్రం దీన్ని ప్రేమికుల స్టార్టప్‌గా పేర్కొంటున్నారు. ప్రేమికుల ఖర్చుల కోసం డబ్బులు కావాలంటే ఇదీ మార్గమా అంటూ సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ఇది డబ్బు సంపాదించేందుకు చేసిన ఓ చీటింగ్ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నప్పటికీ అది నిజంగా అతడి ప్రేమను పంచుకునేందుకు చేసిన చిన్ని ప్రయత్నంగా భావించేవారూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ల ఫొటోలు వైరల్ కావడంతో రాహుల్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
దీన్ని చూసిన కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో పడ్డాడు కానీ ఖర్చులకు భయపడ్డాడు అంటూ కామెంట్లు వస్తున్నాయి. మరికొందరు ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ప్రేమ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ పక్కా వ్యూహంతో సోషల్ మీడియాను మాయ చేయాలనుకుంటే ఎలా చేయాలో రాహుల్ చూపించాడు. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక కొత్త మోటివేషన్‌గా మారుతుందా లేక నిందల పాలయ్యే ఫన్నీ ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. అయినా ప్రేమలో పడితే ఏ పని చేయించుకోవచ్చన్న చిట్కాను మాత్రం అతడు నిరూపించాడు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.