Telugu Actress: ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎన్నో కలలతో అడుగుపెడుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోయిన్స్‌గా రాణించిన వారు మన దగ్గర కోకొల్లలు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగింది ఆమె.. ఆమె అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూశారు. చిన్న వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి ఆతర్వాత ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది ఆమె. చిన్న వయసులో బలవంతపు పెళ్లి చేయడంతో.. ఆ తర్వాత సర్దుకోలేక ఇంట్లో నుంచి పారిపోయిన ఆమె.. స్టార్ గా మారింది. కోట ఆస్తి సంపాదించింది.. కానీ చివరకు ఊహించని విధంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.
తెలుగు సినిమా హిస్టరీలో సిల్క్ స్మిత ఒక సంచలనం. ఆమె పేరు వినగానే గ్లామర్, ధైర్యంతోపాటు మంచి మంచితనం గుర్తుకొస్తాయి. తెరపై ఆమె ఎంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించారో, ఆమె జీవితం అంతకు మించి విషాదభరితంగా, కష్టాలతో నిండి ఉంది. విజయలక్ష్మిగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన సిల్క్ స్మిత జీవితంలో అతి చిన్న వయసులోనే ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. ఈ వివాహం ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. భర్త, అతని కుటుంబం నుంచి ఎదురైన వేధింపులు, కష్టాల కారణంగా ఆమె ఆ ఇంటిని వదిలి పారిపోయింది.
కొత్త జీవితం కోసం ఆశగా చెన్నై చేరుకున్న ఆమె, తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మొదట సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ, సినిమాలపై తన ఆసక్తిని పెంచుకుంది. ఆమెలోని అందం, ఆకర్షణ, అభినయ సామర్థ్యం దర్శకుల దృష్టిని ఆకర్షించాయి. దర్శకుడు విను చక్రవర్తి ఆమె ప్రతిభను గుర్తించి, ‘స్మిత’ అనే పేరుతో ఆమెను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ‘వండిచక్కరం’ (1980) అనే తమిళ చిత్రంలో ‘సిల్క్’ అనే పాత్ర పోషించిన తర్వాత, ఆమెకు ‘సిల్క్ స్మిత’ అనే పేరు స్థిరపడిపోయింది.
ఇవి కూడా చదవండి
అప్పటినుంచి సిల్క్ స్మిత వెనుదిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో సుమారు 450కి పైగా చిత్రాలలో నటించి, అతి తక్కువ కాలంలోనే ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆమె నటనలోని సహజత్వం, బోల్డ్ క్యారెక్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా ఉందంటే, అందులో సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే ధీమా ఉండేది. ఆమె ఒక ఐటెం సాంగ్ స్టార్‌గా మాత్రమే కాకుండా, అనేక చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి తన అభినయ ప్రతిభను నిరూపించుకున్నారు.
అయితే, ఆమె జీవితం బయటికి కనిపించినంత సంతోషంగా లేదు. బాల్యంలో వివాహం, ఆ తర్వాత ఒంటరితనం, ఆర్థిక కష్టాలు ఆమెను వెంటాడాయి. 1996లో ఆమె మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక పెద్ద షాక్. ఆమె జీవితం ఒక విషాద కావ్యంగా ముగిసిపోయింది.
సిల్క్ స్మిత జీవితం ఒక వైపు ఆమె ధైర్యానికి, మరోవైపు సినీ ప్రపంచంలోని చీకటి కోణాలకు అద్దం పడుతుంది. 14 ఏళ్లకే పెళ్లై, ఆ కష్టాలను దాటుకుని స్టార్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం, ఎప్పటికీ సినీ చరిత్రలో నిలిచిపోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..