మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో కేతువు పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి, మానసిక ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల వేధింపులు, విమర్శలు బాగా తగ్గిపోతాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
కర్కాటకం: ఈ రాశికి కేతువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాలు, వ్యక్తిగత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన చికాకులు, అపార్థాల నుంచి విముక్తి లభిస్తుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల వేధింపుల నుంచి బయట పడతారు. మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయంలో ఆశించిన వృద్ధికి అవకాశం ఉంది.
సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు పుబ్బా నక్షత్ర ప్రవేశం వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తొలగిపోతాయి. ఉద్యోగుల సమర్థత మీద అధికారులకు క్రమంగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల బెడద నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు, విభేదాలు చాలావరకు సమసిపోతాయి. అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది.
తుల: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువు రాశ్యధిపతి శుక్రుడికి చెందిన పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల వ్యక్తిగత సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొటొక్కటిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి ఉన్న ఆటంకాలు మటుమాయం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న కేతువు సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడి నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం బాగానే వృద్ధి చెందడం వల్ల వ్యక్తిగత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి, సీనియర్ల నుంచి వేధింపులు, విమర్శలు, అడ్డం కులు తగ్గిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు.
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు పుబ్బా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు, మాట పట్టింపులు, వివాదాలు, ఎడబాట్లు తొలగిపోతాయి. అంతేకాక, జీవిత భాగస్వామి పూర్తి స్థాయిలో అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత పురో గతికి ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సాఫీగా, హ్యాపీగా, సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు క్రమంగా తగ్గిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.