హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో… వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వీధులు వాగులుగా మారాయి. కాలనీలు చెరువుల్లా మారాయి. కార్లు, బైకులు నీట మునిగాయి. ఇక ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.1లో భారీ వృక్షం నేలకూలింది. ఇక పంజాగుట్ట-మాసాబ్‌ట్యాంక్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. రాజ్‌భవన్ సమీపంలో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన ఉండడంతో…ఉద్యోగులకు సేఫ్టీ గైడ్‌లైన్స్‌ను పోలీసులు జారీ చేశారు. దశలవారీగా ఇళ్లకు బయల్దేరాలని సూచించారు.
గంటలో 7 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం
నగరంలో భారీ వర్షానికి తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి హైదరాబాద్‌లో కుండపోత వాన కురిసింది. గంటలో అత్యధికంగా ఏడు సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. జూబ్లీహిల్స్, షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. మెహిదీపట్నంలో 5.3సెంటీమీటర్లు, ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్‌లో 4.6, యూసఫ్‌గూడ 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రీవనం 3.4, కూకట్‌పల్లిలో 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురుగాలులు నగర వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సికింద్రాబాద్,కోఠితో పాటు అన్నీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక మంగళవారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములుమెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉంది.