నాణేనికి రెండు వైపులా అన్నట్లు ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీతో లాభాలు ఎన్ని ఉన్నాయో..? నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ స్కామ్, ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్ ఘటనలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఇతరుల ఫొటోలు లీక్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఎంతోమంది అమ్మాయిల ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య వంటి విషాద ఘటనలకు పాల్పడ్డారు. అయితే ఫొటోలు లీక్ అయినప్పుడు మీరు ఏం చేయాలి అనేది తప్పక తెలుసుకోవాలి. ఎవరైనా మీ ఫోటో లేదా వీడియోను ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తే.. వాటిని ఎలా తొలగించాలో కూడా మీరు తెలుసుకోవాలి.
StopNCII.org నుండి సహాయం:
మీ అనుమతి లేకుండా మీ ప్రైవేట్ ఫోటో లేదా వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయితే.. మీరు StopNCII.org నుండి సహాయం పొందవచ్చు. ఈ సైట్ ఇంటర్నెట్, సోషల్ మీడియా నుండి మీ వైరల్ ఫోటోలు, వీడియోలను తొలగించడానికి సహాయపడుతుంది. StopNCII.org ఎవరికి సంబంధించినది అనేది మీ మనసులో ప్రశ్న తలెత్తవచ్చు. ఈ సైట్ అంతర్జాతీయ ఛారిటీ సంస్థ. స్టాప్ నాన్ కన్సెన్సువల్ ఇంటిమేట్ ఇమేజ్ అబ్యూజ్.. SWGfL లో భాగం.
వీడియో వైరల్ అయితే ఏమి చేయాలి?
చట్టపరమైన చర్య:
ఫోటో లేదా వీడియో వైరల్ అయితే భయపడవద్దు. ఎందుకంటే అనుమతి లేకుండా ఫోటో లేదా వీడియోను షేర్ చేయడం చట్టపరమైన నేరం. అలాంటి వ్యక్తిపై 2000 ఐటీ చట్టంలోని సెక్షన్ 66E కింద ఫిర్యాదు చేయవచ్చు. దీని కింద ఆ వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఫిర్యాదు చేయండి:
వైరల్ అయిన ఫోటో లేదా వీడియో గురించి మీరు నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఆన్‌లైన్ ఫిర్యాదు:
మీరు హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ cybercrime.gov.inలో ఆన్‌లైన్‌లో బ్లాక్‌మెయిల్ ఫిర్యాదును దాఖలు చేయవచ్చు.
భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనల గురించి మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూలై 22న.. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్‌సభలో సైబర్ నేరాలకు సంబంధించిన డేటాను సమర్పించారు. నివేదిక ప్రకారం.. 2024లో, దేశవ్యాప్తంగా మొత్తం రూ. 22,845.73 కోట్ల ప్రజల సొమ్మును లూటీ చేశారు. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 206 శాతం ఎక్కువ. అంటే 2023లో ఇది రూ.7,465.18 కోట్లుగా ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..