Mohammed Siraj: నాడు ఆటోడ్రైవర్ కొడుకు.. నేడు ఇండియా పేస్ సెన్సేషన్.. సిరాజ్ కథ వింటే కన్నీళ్లే

Mohammed Siraj: నాడు ఆటోడ్రైవర్ కొడుకు.. నేడు ఇండియా పేస్ సెన్సేషన్.. సిరాజ్ కథ వింటే కన్నీళ్లే


Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్.. భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో ఈ సిరీస్‌ రియల్ హీరో. ఐదు టెస్టులూ ఆడిన ఏకైక పేస్ బౌలర్ సిరాజ్. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపైన కూడా అలుపెరగని ఉత్సాహంతో బౌలింగ్ చేసి, తన అంకితభావాన్ని చాటుకున్నాడు. అతని ఏకైక లక్ష్యం భారత్‌ను గెలిపించడం. ఓవల్ టెస్టులో అతని పోరాటం స్పష్టంగా కనిపించింది. చివరి టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించి, ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం ఆరు పరుగులు అవసరమైన సమయంలో చివరి వికెట్ తీసి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ ప్రదర్శన చూసిన తర్వాత, చాలామంది అతన్ని ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అని పొగిడారు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా, పిచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా నిలకడగా బౌలింగ్ చేసి జట్టుకు కీలక విజయాలు అందించాడు. చివరి ఓవల్ టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ డ్రాగా ముగిసిన సిరీస్‌లో ట్రోఫీని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్‌లోని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.

కష్టాల నడుమ సాగిన సిరాజ్ చిన్ననాటి జీవితం

హైదరాబాద్‌లోని ఇరుకు సందుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదిక వరకు మహమ్మద్ సిరాజ్ ప్రయాణం చాలా ఇబ్బందుల నడుమ సాగింది. మార్చి 13, 1994న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సిరాజ్, బంజారా హిల్స్‌లోని ఒక అద్దె ఇంట్లో పెరిగాడు. అతని తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేది. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ, అతని తల్లిదండ్రులు సిరాజ్ క్రికెట్ కలను నెరవేర్చుకోవడానికి అడ్డు చెప్పలేదు.

చిన్నతనంలో సిరాజ్‌కు సరైన కోచింగ్ దొరకలేదు. స్థానిక కుర్రాళ్లతో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అతని వేగం, దూకుడు అతని స్నేహితుల దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత అతను చార్మినార్ క్రికెట్ క్లబ్‌లో చేరి, లెదర్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కూడా సిరాజ్ క్రికెట్ కిట్ కొనుక్కోలేకపోయాడు. బస్సు చార్జీలు కూడా లేకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు.

మలుపు తిప్పిన క్షణం..

2015లో సిరాజ్ హైదరాబాద్ అండర్-23 జట్టుకు సెలక్ట్ కావడంతో తన జీవితంలో ఓ మలుపు తిరిగింది. అతని అద్భుతమైన ప్రదర్శనలు రంజీ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించి పెట్టాయి. 2016-17 రంజీ సీజన్‌లో సిరాజ్ తొమ్మిది మ్యాచ్‌లలో 41 వికెట్లు తీసి హైదరాబాద్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని వేగం, దూకుడు ఐపీఎల్ స్కౌట్స్‌ను ఆకర్షించాయి.

2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సిరాజ్‌ను ఐపీఎల్ వేలంలో రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన T20Iలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ అతని ప్రయాణం అంత సులభం కాదు. తొలి మ్యాచ్‌లలో అతని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. కానీ అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఆ కష్ట సమయంలో భరత్ అరుణ్, విరాట్ కోహ్లీ లాంటి మెంటార్లు అతనికి అండగా నిలిచారు.

తండ్రికి అంకితం..

సిరాజ్ జీవితంలో అతిపెద్ద మలుపు ఆస్ట్రేలియాతో 2021లో జరిగిన టెస్ట్ సిరీస్. ఈ సిరీస్‌కు వెళ్లడానికి కొన్ని రోజుల ముందు అతని తండ్రి చనిపోయారు. తండ్రిని చివరి చూపు చూడలేకపోయినప్పటికీ, దేశం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. గాయాలతో బౌలర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్న సమయంలో, సిరాజ్ భారత బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్టులో ఐదు వికెట్లు తీసి, భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆ విజయాన్ని తన తండ్రికి అంకితం చేసి భావోద్వేగానికి లోనయ్యాడు.

ఒక సాధారణ ఆటో డ్రైవర్ కొడుకుగా మొదలుపెట్టి, ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా ఎదగడం సిరాజ్ పట్టుదల, కష్టానికి నిదర్శనం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సరైన సదుపాయాలు లేకపోయినా.. కలను నమ్మి పోరాడితే విజయం సాధించవచ్చని సిరాజ్ తన జీవితంతో నిరూపించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *