
అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్నేహితుల దినోత్సవం రోజు పెను విషాదం వెలుగు చూసింది. టి. వీరాపురం గ్రామ సమీపంలో దొణగంగమ్మ గుడి వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తోటకు వెళ్లిన వీరు సాయంత్రానికి నీటి కుంటలో శవాలై తేలారు. రాత్రి 7 గంటలకు వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతి చెందిన శ్వేత (11) మౌనిక (9) ఇద్దరు పక్క పక్క ఇంటిలో ఉండే ప్రాణస్నేహితులు కావడం విశేషం. స్నేహితుల దినోత్సవం నాడే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు మృత్యువు ఒడిలో చేరారు.
వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న శ్వేత కాఫీ తాగాలనిపించి గ్యాస్ స్టవ్ మీద కాఫీ పెట్టుకుంది. ఈ క్రమంలో కాఫీ పెట్టిన గిన్నే కాస్త మాడిపోయి నల్లగా మసిపారిపోయింది. దీంతో తల్లిదండ్రులు వచ్చి చూస్తే తిడతారని భయపడిపోయిన శ్వేత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లేముందు శ్వేత తన చెల్లితో తాను దోనగంగమ్మ కుంటలోపడి చనిపోతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా వెళ్లే క్రమంలోనే తనకు తోడుగా తన స్నేహితురాలైన మౌనికను కూడా శ్వేత వెంటపెట్టుకొని తీసుకెళ్లిందని.. ఆమె చెల్లి కుటుంబ సభ్యులకు తెలిపినట్టు తెలుస్తోంది.
ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో హుటాహుటిన దోనగంగమ్మ కుంటకు చేరుకున్నారు. కుంటలో దూకి బాలికల ఆచూకీ కోసం వెతికగా నీటిలో ఇద్దరు బాలికల మృతదేహాలు దొరికాయి. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.