IND vs ENG : మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఓవల్ టెస్ట్ మ్యాచ్ కూడా అదే ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయినప్పుడు అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను 23 పరుగుల స్వల్ప ఆధిక్యానికే పరిమితం చేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు అదరగొట్టి, ఇంగ్లాండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో గత రికార్డుల ఆధారంగా టీమిండియా గెలుపు లాంఛనప్రాయమే అని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఓవల్ మైదానంలో ఇంత భారీ లక్ష్యాన్ని ఏ జట్టు కూడా ఇప్పటివరకు చేధించలేదు. ఈ మైదానంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ చేజ్ రికార్డ్ కేవలం 263 పరుగులు మాత్రమే. ఈ రికార్డును 1902లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై సాధించింది. ఈ రికార్డుకు ఇప్పుడు 123 సంవత్సరాలు దాటినా ఎవరూ దాన్ని బద్దలు కొట్టలేకపోయారు. అంటే, ఓవల్‌లో 300 పరుగుల లక్ష్యం కూడా ఇప్పటివరకు ఎవరూ చేధించలేదు.
ఓవల్ మైదానంలో అత్యధిక రన్ చేజ్ రికార్డులు ఇవి:
263 పరుగులు: ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (1902)
252 పరుగులు: వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (1963)
242 పరుగులు: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (1972)
225 పరుగులు: వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (1988)
219 పరుగులు: శ్రీలంక vs ఇంగ్లాండ్ (2024)
ఈ గణాంకాలను బట్టి చూస్తే 374 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్‌కు ఎంత కష్టమో అర్థమవుతోంది.
భారత్‌కు మూడవ చారిత్రక విజయం
భారత జట్టు ఓవల్ మైదానంలో ఇప్పటివరకు 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 1971, 2021లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్‌ను గెలిస్తే, ఓవల్‌లో ఇది భారత్‌కు మూడవ విజయం అవుతుంది. దీంతో భారత జట్టుకు చారిత్రక విజయం లభించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ తమ ఆటతీరును బ్యాజ్‌బాల్ అని పిలుచుకుంటుంది. అంటే దూకుడుగా, వేగంగా ఆడడం. ఇది కొన్నిసార్లు వారికి కలిసివస్తుంది.. కానీ కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. 374 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఇంగ్లాండ్ బ్యాజ్‌బాల్ స్టైల్‌లో ఆడితే, అది భారత బౌలర్లకు వికెట్లు తీయడానికి మంచి అవకాశం అవుతుంది. కాబట్టి, భారత్ ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను 2-2తో డ్రా చేసే అవకాశం ఎక్కువగా ఉంది.