ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ జుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. చాలా మంది జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో లభించే రకరకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిల్లోని రసాయనాలు జుట్టుకు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. మీకు తెలుసా బీర్ జుట్టు సంరక్షణకు ప్రభావవంతంగా పని చేస్తుందట. ఈ ఆల్కహాల్ పానీయం జుట్టు సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే సందేహం మీకు తలెత్తవచ్చు. నిజానికి, బీరులో ఉండే కాల్షియం, ఐరన్, ప్రోటీన్, సెలీనియం, విటమిన్ డి, విటమిన్ ఇ జుట్టును శుభ్రపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి నిస్తేజమైన జుట్టుకు కొత్త మెరుపును పెంచుతుందట. కాబట్టి మీ ఇంట్లో బీరు ఉంటే ఈవిధమైన షాంపూ తయారు చేసి ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. బీర్ షాంపు ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
బీర్ షాంపు ప్రయోజనాలు
- బీర్ షాంపూని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు పొడవుగా, మందంగా పెరుగుతుంది.
- దీనిలో ఉండే సిలికా అనే మూలకం జుట్టు మెరుపును పెంచడానికి, దానికి పోషణ అందించడానికి సహాయపడుతుంది.
- బీర్ షాంపూ జుట్టు నుంచి అదనపు నూనె, జిడ్డును కూడా తొలగిస్తుంది.
- చుండ్రు, దురద వంటి సమస్యలు ఉంటే బీర్ షాంపూ వాడటం ప్రభావవంతంగా ఉంటుంది.
జుట్టు సంరక్షణకు బీరును ఎలా ఉపయోగించాలంటే..
ముందుగా జుట్టును నూనెతో మసాజ్ చేసుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చివరగా బీర్‌ను కండిషనర్‌గా ఉపయోగించాలి. ఒక కప్పు బీర్‌లో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి తలపై, జుట్టు మూలాలకు అప్లై చేయాలి. పది నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తర్వాత, చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు జిడ్డుగా మారకుండా మృదువుగా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
ఇంట్లో బీర్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలంటే..
మార్కెట్లో లభించే షాంపూలకు బదులుగా బీర్ షాంపూను ఉపయోగించడం వల్ల ప్రభావవంతమైన ఫలితాలు లభిస్తాయి. ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు బీరు తీసుకొని పదిహేను నిమిషాలపాటు బాగా మరిగించాలి. తర్వాత చల్లబరచాలి. ఇందులో రోజూ ఉపయోగించే షాంపూను దానిలో కలిపి.. మరో సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బీర్ షాంపూను తల స్నానం చేసేటప్పుడు ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి
నోట: మీకు ఏదైనా అలెర్జీ ఉంటే, బీర్ షాంపూ ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.