అన్ని రోజులు ఒకేలా ఉండవుగా.. ఎప్పటిలానే దొంగతనం చేసిన ఆ దొంగ టీచర్ కి.. దొంగతనం చేశాక దిమ్మతిరిగేలా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంతకీ ఏమి జరిగింది అనుకుంటున్నారా? అయితే.. ఈ కథనంలో చదవండి.. విజయనగరం జిల్లా వంగర మండలం బాగెంపేటకు చెందిన రెడ్డి గోపాలకృష్ణ నాయుడు ఎం . సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ డ్రాయింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కావడంతో వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. తక్కువ ఆదాయం కావడంతో పాటు చెడు వ్యసనాలు, బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దీంతో అప్పుల పాలయ్యాడు. తనకున్న అప్పులు తీర్చుకునేందుకు దొంగ అవతారమెత్తాడు. దీంతో అదే గ్రామంలో డబ్బున్న పశుమర్తి శంకరరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఒక్కడే దొంగతనం చేయడం కష్టం కావడంతో పాత పరిచయస్తులైన శ్రీరామ బాలరాజు, జాడ దుర్గారావులకు తన మనసులో మాట చెప్పాడు.
అలా వారు ముగ్గురు అదును కోసం ఎదురుచూస్తుండగా ఇంతలో శంకరరావు కుటుంబం ఓ కార్యం నిమిత్తం కుటుంబం అంతా కలిసి హైదరాబాద్ వెళ్ళింది. విషయం తెలుసుకున్న టీచర్ గోపాలకృష్ణ మిగతా ఇద్దరితో కలసి గత నెల 25న ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 200 గ్రాముల బంగారు నగలు, ఇత్తడి వస్తువులను ఎత్తుకెళ్లారు. దొంగిలించిన వాటిలో నెక్లెస్, బ్రాసెలెట్, హారం, ఉంగరం, చెవిదుద్దులు, ఇత్తడి ప్లేట్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న శంకరరావు హైదరాబాద్ నుండి వచ్చి వంగర పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు చేస్తున్న దర్యాప్తుకి భయపడ్డ నిందితులు ఎలాగైనా బంగారాన్ని తిరిగి ఇచ్చి కేసు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే బంగారాన్ని శంకరరావు స్కూటీలో పెట్టి శంకరారావుకు ఫోన్ చేసి బంగారాన్ని స్కూటీలో పెట్టామని, ఫిర్యాదు వెనక్కి తీసుకోమని కోరారు.

Gold Theft Case
ఈ విషయాన్ని శంకర్రావు పోలీసులకు తెలిపాడు.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. వెతకడం ప్రారంభించారు. అనంతరం పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని శంకరరావు ఇచ్చారు. అనంతరం శంకర్రావుకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దృష్టిసారించారు. ఎట్టకేలకు ముగ్గురు నిందితులను టెక్నాలజీ సహాయంతో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 16 తులాల బంగారం, ఇత్తడి వస్తువులు స్వాధీనం కాగా, మిగిలిన 2 తులాలు బంగారం బాలరాజు తన ప్రియురాలు పేరు మీద పార్వతీపురంలో కుదువ పెట్టాడు. పోలీసులు ఆ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దొంగలు పశ్చాత్తాపంతో బంగారం తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసినా, చట్టం మాత్రం వారిని వదలలేదు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..