
పీనట్ బటర్.. అదేనండీ వేరుశనగ వెన్న తెలియని వారుండరు. చాలా మంది రోజూవారీ అవసరాలకు ఇంట్లో వినియోగిస్తుంటారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే పీనట్ బటర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా పరిగణించబడుతుంది. దీని ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి కొండంత అండ
వేరుశెనగ వెన్నలో లభించే సహజ కొవ్వులు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు వేరుశెనగ వెన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వేరుశెనగ వెన్నలోని పోషకాలు, ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వేరుశెనగ వెన్న బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆకలిని నియంత్రించడానికి దీనిని తినవచ్చు.
మంచి నిద్రకు కాస్తింత పీనట్ బటర్..
రాత్రి పడుకునే ముందు ఒక చెంచా వేరుశెనగ వెన్న తినడం వల్ల కమ్మని నిద్ర పడుతుంది. ఇందుకు అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. వేరుశెనగ వెన్నలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. మంచి రాత్రి నిద్రకు, ఉదయం ఉత్సాహంగా మేల్కొనడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, వేరుశెనగ వెన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. ఇందులో ఉండే అమైనో ఆమ్లం అర్జినిన్ గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడే అధిక ఫైబర్ కంటెంట్ వేరుశెనగ వెన్నలో పుష్కలంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.