World Record:క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడం సర్వసాధారణం. కానీ, కొన్ని రికార్డులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అలాంటి అరుదైన ఫీట్‌ను అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ గనీ సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 45 రన్స్ కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ విధ్వంసం ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ECS T10 టోర్నమెంట్‌లో గనీ ఈ అద్భుతమైన ఫీట్‌ను చేసి చూపించాడు. సాధారణంగా ఒక ఓవర్లో 36 పరుగులు వస్తాయనేది మనకు తెలిసిందే. కానీ ఉస్మాన్ గనీ మాత్రం ఒకే ఓవర్లో 45 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందెన్నడూ ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇలా జరగలేదు. ఈ సంచలన రికార్డు ఎలా నమోదైందో తెలుసుకుందాం.
లండన్‌లో జరిగిన ECS T10 ఇంగ్లాండ్ టోర్నమెంట్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఆగస్ట్ 1న లండన్ కౌంటీ క్రికెట్ క్లబ్, గిల్డ్‌ఫోర్డ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ గనీ ఈ రికార్డు సాధించాడు. గిల్డ్‌ఫోర్డ్ బౌలర్ విల్ ఎర్నీ వేసిన ఒక ఓవర్లో ఉస్మాన్ గనీ వీరవిహారం చేశాడు. గనీ బ్యాటింగ్ స్ట్రైకింగ్ 6+నోబాల్, 6, 4+వైడ్, 6, 4+నోబాల్, 6, 0, 6, 4 గా ఉంది. ఈ ఓవర్లో ఉస్మాన్ గనీ బ్యాట్ నుంచి 42 పరుగులు వచ్చాయి. బౌలర్ వేసిన రెండు నోబాల్స్, ఒక వైడ్ బాల్ కారణంగా ఎక్స్ ట్రా 3 రన్స్ వచ్చాయి. దీంతో మొత్తం 45 పరుగులు ఒకే ఓవర్లో వచ్చాయి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఓవర్‌గా ఇది నిలిచిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ గనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లో 153 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 355.81 కావడం విశేషం. గనీకి తోడుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇస్మాయిల్ బహ్రామీ కూడా 19 బంతుల్లో 61 పరుగులు చేశాడు. వీరిద్దరి వీరవిహారం కారణంగా లండన్ కౌంటీ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 226 పరుగులు చేసింది.
లండన్ కౌంటీ జట్టు నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గిల్డ్‌ఫోర్డ్ విఫలమైంది. గిల్డ్‌ఫోర్డ్ జట్టు 10 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేసి 71 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా అర్థ సెంచరీ చేయలేకపోయాడు. 29 ఏళ్ల ఉస్మాన్ గనీ అఫ్గానిస్తాన్ తరఫున 17 వన్డేలు, 35 టీ20I మ్యాచ్‌లు ఆడాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉస్మాన్ గనీ, 2023లో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుపై అవినీతి ఆరోపణలు చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. బోర్డులో నిజాయితీ, సరైన నిర్వహణ ఉంటేనే మళ్లీ తిరిగి వస్తానని ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..