IND-W vs AUS-W: కంగారూ గడ్డపై 500 పరుగులు.. చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్

IND-W vs AUS-W: కంగారూ గడ్డపై 500 పరుగులు.. చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్


IND-W vs AUS-W: ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న సమరంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆస్ట్రేలియా గడ్డపై పరుగుల వరద పారిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం (ఫిబ్రవరి 21) అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గత మ్యాచ్‌లో కేవలం 31 పరుగులకే పరిమితమైన ఆమె, ఈసారి మాత్రం కంగారూ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షెఫాలీ వర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వని స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. కేవలం 38 బంతుల్లోనే తన 35వ అంతర్జాతీయ టీ20 అర్ధసెంచరీని పూర్తి చేసుకుంది. ఒకసారి సెటిల్ అయిన తర్వాత మంధాన బ్యాట్ జులిపించింది. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. చూస్తుంటే మంధాన తన మొదటి టీ20 సెంచరీని బాదేలా కనిపించింది.

మంధాన 17వ ఓవర్‌లో ఒక భారీ సిక్సర్ బాది 80 పరుగుల మార్కును దాటింది. కానీ, దురదృష్టవశాత్తూ తర్వాతి బంతికే మరో సిక్సర్ కొట్టబోయి బాండరీ లైన్ దగ్గర క్యాచ్ అవుట్ అయింది. మొత్తంగా 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి వెనుతిరిగింది. సెంచరీ చేజారినా, ఆమె చేసిన ఈ ఇన్నింగ్స్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మంధాన, జెమిమా రెండో వికెట్‌కు ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి ధాటికి టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు సాధించింది.

స్మృతి మంధాన ఈ ఇన్నింగ్స్‌తో కొన్ని అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఆస్ట్రేలియాలో ఒక టీ20 మ్యాచ్‌లో 80 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా మంధాన నిలిచింది. అంతేకాకుండా, ఆస్ట్రేలియా గడ్డపై టీ20 క్రికెట్‌లో 500 పరుగుల మార్కును దాటిన మొదటి భారత వీరనారిగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అక్కడ 18 ఇన్నింగ్స్ ఆడిన మంధాన 4 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 529 పరుగులు చేసింది. ఆమె ఫామ్ చూస్తుంటే రాబోయే వరల్డ్ కప్‌లో భారత్‌కు తిరుగుండదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *