మనం పాఠశాల విద్యస్థాయి నుంచి గురువులను గౌరవిస్తూ వారిని దేవుళ్లతో సమానంగా పోలుస్తూ ఒక శ్లోకం చదివాం. అదే, “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”. ఈ శ్లోకం ప్రతి భారతీయుడికి సుపరిచితమే అని చెప్పాలి. కానీ, ఈ శ్లోకం వెనుక ఉన్న భావం, మహిమ, కథ చాలా మందికి తెలియదు. పూర్వం కౌత్సుడు అనే పేద బాలుడిని విద్యాధరుడు అనే మహా గురువు తన ఆశ్రమానికి తీసుకెళ్లి ప్రేమతో అన్ని విద్యలు బోధించాడు. కౌత్సుడు గురువుపట్ల అపారమైన భక్తి, వినయం కలిగిన శిష్యుడు.
గురువును వదిలని శిశ్యుడు
ఒకసారి గురువు కొన్ని రోజులపాటు ఆశ్రమం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కౌత్సుడు ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించాడు. కొద్ది కాలానికి అతని విద్యాభ్యాసం పూర్తయింది. అతన్ని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. అయితే కౌత్సుడు, “నేను గురువుగారిని వదిలి వెళ్లను” అని స్పష్టంగా చెప్పి వారిని వెనక్కి పంపించాడు.
దానికి కారణం అడిగిన గురువుకు కౌత్సుడు వినమ్రంగా ఇలా చెప్పాడు.. గురువుగారూ, మీరు బయట ఉన్నప్పుడు మీ జాతకాన్ని చూశాను. సమీప భవిష్యత్తులో మీకు తీవ్రమైన వ్యాధి సంభవించబోతోంది. ఆ సమయంలో మీ సేవ చేయడం నా కర్తవ్యం. అందుకే మీను వదిలి వెళ్లలేను.
కొన్ని రోజులకు గురువుగారికి క్షయ వ్యాధి వచ్చింది. ఆ కాలంలో దానికి చికిత్స లేకపోవడంతో, పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లి దానధర్మాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గురుశిష్యులు కలిసి కాశీకి చేరుకున్నారు. గురువుగారి వ్యాధి కారణంగా అక్కడి ప్రజలు వారిని దూరంగా ఉంచినా.. కౌత్సుడు మాత్రం నిరంతరం గురుసేవలో నిమగ్నుడై ఉన్నాడు.
గురుభక్తికి మెచ్చి.. దిగివచ్చిన త్రిమూర్తులు
అతని గురుభక్తిని పరీక్షించేందుకు త్రిమూర్తులు మారువేషాల్లో వచ్చారు. మొదట బ్రహ్మ వచ్చి, “ఇలాంటి వ్యాధిగ్రస్తుడిని వదిలి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు” అని చెప్పాడు. కౌత్సుడు వినలేదు. తర్వాత విష్ణువు వచ్చి ఇదే సలహా ఇచ్చినా అతను కదలలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చి కూడా అదే చెప్పగా, కౌత్సుడు దృఢంగా ఇలా అన్నాడు: ‘నా గురువు నాకు దేవుడికంటే గొప్పవారు. వారిని వదిలి నేను ఎక్కడికీ వెళ్లను’ అని.
అతని అచంచలమైన గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు తమ అసలు రూపంలో ప్రత్యక్షమయ్యారు. “నీకు మోక్షం ప్రసాదిస్తాం” అని వరం ఇవ్వబోతే.. కౌత్సుడు వినయంతో ఇలా అన్నాడు: “మీ గురించి నాకు బోధించి, ఈ రోజు మీ దర్శనం కలిగేలా చేసినవారు నా గురువుగారే. నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే నా గురువు.” అని ఈ మహా శ్లోకాన్ని ఉచ్చరించాడు.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అతను తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని ప్రార్థించాడు. త్రిమూర్తులు గురుభక్తికి మెచ్చి గురువుగారికి మోక్షం అనుగ్రహించారు. ఆనందభరితుడైన కౌత్సుడు తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు.
ఈ కథ మనకు చెప్పేది ఏమిటి?
గురు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశం అందించే దైవస్వరూపం. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సరసన నిలబెట్టారు. ఇలాంటి శ్లోకాల అర్థం, వాటి వెనుక ఉన్న విలువలు మనం తెలుసుకుని, మన తరువాత తరాలకు కూడా తెలియజేయడం మన బాధ్యత.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగతం.)