డిటర్జెంట్ అవసరానికి మించి వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. బట్టలను సరిగ్గా ఆరవేసినా లేదా ఉతికినా.. అధిక డిటర్జెంట్ అవశేషాలు బట్టల పోగుల మధ్య ఉండిపోతాయి. ఇవి చర్మంతో తాకినప్పుడు దురద, చికాకు, అలెర్జీలు, దద్దుర్లకు దారితీస్తాయి.
ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల బట్టల రంగు త్వరగా వెలిసిపోవడమే కాకుండా అవి గరుకుగా మారుతాయి. మెషీన్ లోపల మురికి, డిటర్జెంట్ అవశేషాలు పేరుకుపోయి బూజు పడుతుంది. ఇది మెషీన్ వైఫల్యానికి దారితీసి త్వరగా పాడయ్యేలా చేస్తుంది.
చాలామందికి ఎంత సర్ఫ్ వేయాలో తెలియక అంచనాగా వేస్తుంటారు. మీ వాషింగ్ మెషీన్లో సగం వరకు బట్టలు ఉంటే.. కేవలం 2 టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పొడి లేదా 30 నుండి 60 ml లిక్విడ్ డిటర్జెంట్ సరిపోతుంది. బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పొడి లేదా 90 ml లిక్విడ్ వాడవచ్చు. బట్టలు ఉతికిన తర్వాత కూడా డిటర్జెంట్ వాసన వస్తుంటే.. మీరు మోతాదును మరో 20-25 శాతం తగ్గించాలని అర్థం.
నీటి నాణ్యతను బట్టి మారే లెక్కలు: మీరు నివసించే ప్రాంతంలో నీరు హార్డ్ వాటర్ అయితే డిటర్జెంట్ కొంచెం ఎక్కువ అవసరం కావచ్చు. అదే మృదువైన నీరు అయితే తక్కువ డిటర్జెంట్ సరిపోతుంది.
నురుగు ఎక్కువగా వస్తేనే బట్టలు తెల్లగా వస్తాయనేది పాతకాలపు ఆలోచన. నేటి ఆధునిక డిటర్జెంట్లు తక్కువ నురుగుతోనే మొండి మరకలను తొలగించేలా తయారవుతున్నాయి. కాబట్టి మోతాదును గమనించి వాడటం వల్ల అటు డబ్బు, ఇటు ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.




