ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి 2008 తర్వాత దాదాపు పూర్తిగా దూరమైన పాకిస్థాన్ క్రికెటర్లు, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో జరిగే ఫ్రాంచైజీ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ (The Hundred)లో కూడా అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫార్మాట్ పరంగా ఐపీఎల్‌కు భిన్నమైనా, పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఇదే తరహా అడ్డంకులు ఎదురవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ కారణంతో ‘ది హండ్రెడ్’ నుంచి పాక్ ఆటగాళ్లు బయటకు..?
రిపోర్టుల ప్రకారం, భారత పెట్టుబడులతో నడిచే ఫ్రాంచైజీలు వచ్చే నెలలో జరగనున్న ది హండ్రెడ్ ఆక్షన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. ఒక ప్లేయర్ ఏజెంట్ దీన్ని ఐపీఎల్ గ్రూప్‌లతో సంబంధం ఉన్న ఫ్రాంచైజీల్లో “కాగితంపై లేని నియమం”గా పేర్కొనడం గమనార్హం. అధికారికంగా పాక్ ఆటగాళ్లపై నిషేధం లేకపోయినా, వాస్తవంగా వివిధ లీగ్‌లలో కనిపిస్తున్న సరళి మాత్రం భారత సంస్థలతో సంబంధం ఉన్న ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను తీసుకోవడంపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.
గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో ఒకే తరహా ట్రెండ్..
పాక్ ఆటగాళ్లకు ఇబ్బందులు ది హండ్రెడ్ వరకే పరిమితం కావడం లేదు. ఐపీఎల్ తొలి సీజన్ (2008) తర్వాత నుంచి పాక్ క్రికెటర్లు ఈ లీగ్‌లో కనిపించడం లేదు. ఇదే పరిస్థితి దక్షిణాఫ్రికాలోని SA20, యూఏఈలో జరిగే ILT20 లీగ్‌లలోనూ ఉంది. ఈ మూడు లీగ్‌ల్లోని ఫ్రాంచైజీలు ప్రధానంగా ఐపీఎల్ గ్రూప్‌ల యాజమాన్యంలో ఉన్నాయి. దీని వల్ల టోర్నమెంట్ నిబంధనలకన్నా, యాజమాన్యంతోనే ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘ది హండ్రెడ్’ యాజమాన్యంలోనూ..
ది హండ్రెడ్‌లోని ఎనిమిది జట్లలో నాలుగు.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సదర్న్ బ్రేవ్, ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో అనుబంధ యాజమాన్యాన్ని కలిగి ఉన్నాయి. కొత్త యాజమాన్య నియమాలు 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB)కి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకారం, ఐపీఎల్‌తో సంబంధం లేని జట్ల నుంచే పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆసక్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అయితే, ECB అధికారికంగా ది హండ్రెడ్ అన్ని దేశాల ఆటగాళ్లకు స్వాగతం పలుకుతుందని, జట్లు గ్లోబల్ డైవర్సిటీ చూపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
2023 ‘ఈక్విటీ ఇన్ క్రికెట్’ నివేదిక తర్వాత ఏర్పడిన స్వతంత్ర క్రికెట్ రెగ్యులేటర్ పర్యవేక్షణలో ది హండ్రెడ్ టోర్నమెంట్ నడుస్తోంది. జాతీయత ఆధారంగా వివక్ష చూపితే అది యాంటీ డిస్క్రిమినేషన్ నిబంధనలకు విరుద్ధం అవుతుంది. ECB సీఈవో రిచర్డ్ గోల్డ్ కూడా అన్ని దేశాల ఆటగాళ్లు ఎంపికకు అర్హులే అని, స్పష్టమైన వివక్ష వ్యతిరేక విధానాలు ఉండాలని గతంలోనే చెప్పారు. వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ కూడా ప్రతి ఆటగాడికి సమాన అవకాశాలు ఉండాలని కోరుతోంది.
అయితే, వాస్తవంగా ఫ్రాంచైజీ లీగ్‌లలో యజమానుల అభిరుచులే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఐపీఎల్‌తో అనుబంధ యాజమాన్యం గ్లోబల్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో పెరుగుతున్న కొద్దీ, పాక్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..