చాలామంది వేరుశెనగలను కేవలం కాలక్షేపం కోసం తినే పదార్థంగా భావిస్తారు. కానీ, ఈ ‘వేరుశెనగ పప్పులు’ మెదడు పాలిట అమృతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డచ్ పరిశోధకులు నిర్వహించిన తాజా స్టడీ ప్రకారం, ప్రతిరోజూ నిర్ణీత పరిమాణంలో వేరుశెనగలు తీసుకోవడం వల్ల ఆలోచనా శక్తి జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడతాయి.
ఏమిటీ పరిశోధన?
నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు 60 నుంచి 75 ఏళ్ల వయస్సు గల ఆరోగ్యవంతులపై 16 వారాల పాటు ఈ ప్రయోగం చేశారు. ఇందులో పాల్గొన్నవారు ప్రతిరోజూ రెండు గుప్పిళ్ల (60 గ్రాముల) ఉప్పు లేని, పొట్టుతో ఉన్న వేయించిన వేరుశెనగలను తిన్నారు.
మెదడుకు అదనపు ఆక్సిజన్!
వేరుశెనగలు తినడం వల్ల మెదడులోని కీలక భాగాలకు రక్త ప్రసరణ పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. “రక్త ప్రసరణ పెరగడం అంటే మెదడుకు అవసరమైన ఆక్సిజన్ పోషకాలు ఎక్కువగా అందడం. ఇది వయసుతో పాటు వచ్చే మెదడు బలహీనతను అరికడుతుంది” అని స్టడీ రచయిత పీటర్ జోరిస్ వివరించారు.
ఎలా తినాలి?
శాస్త్రవేత్తల సూచన ప్రకారం..
రోజుకు సుమారు 60 వేయించిన వేరుశెనగ పప్పులు (ఉప్పు లేనివి) తినాలి.
వీటిని నేరుగా స్నాక్స్‌లాగా గానీ లేదా అన్నంలో కలుపుకుని గానీ తీసుకోవచ్చు.
వేరుశెనగ పప్పుపై ఉండే సన్నని పొర (Skin)లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి, పొట్టుతో కలిపి తినడం మంచిది.
డిమెన్షియా ముప్పుకు చెక్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 13 కోట్లకు చేరుతుందని అంచనా. ఇటువంటి తరుణంలో, తక్కువ ధరలో దొరికే వేరుశెనగలు మెదడును రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన భరోసా ఇస్తోంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.