New Labour Codes: భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లు చిన్నపాటి వ్యాపారాలలో పనిచేసే ఉద్యోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ చట్టాలు ఉద్యోగుల హక్కులు, సామాజిక భద్రత, కనీస వేతనాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కోడ్‌ల ప్రకారం వచ్చిన ముఖ్యమైన మార్పులను అర్థం చేసుకోవడం ఉద్యోగులకు, యజమానులకు అవసరం. ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ లేబర్ కోడ్ 2025 నంబర్‌లో అమల్లోకి వచ్చింది.
కొత్త లేబర్ కోడ్స్ (2025-26) ప్రకారం.. ముఖ్యంగా అపాయింట్‌మెంట్ లెటర్ల విషయంలో కొత్త నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతవరకు అనేక చిన్న దుకాణాలు, షోరూమ్‌లు లేదా చిన్న కంపెనీలు తమ ఉద్యోగులకు అధికారిక అపాయింట్‌మెంట్ లెటర్లను జారీ చేయకుండానే పనిలోకి తీసుకునేవి. కానీ, కొత్త లేబర్ కోడ్‌లు ఎంత చిన్న సంస్థ అయినా, అది ఒక దుకాణం, షోరూమ్ లేదా కంపెనీ అయినా సరే, ప్రతి ఉద్యోగిని నియమించుకున్నప్పుడు తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలని నిర్దేశిస్తున్నాయి. ఈ లెటర్ ఉద్యోగికి తన నియామకానికి సంబంధించిన అధికారిక రుజువుగా, భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపాధి ధ్రువీకరణగా ఉపయోగపడుతుంది. ఇది ఉద్యోగులకు పనిలో భద్రతను, పారదర్శకతను కల్పిస్తుంది.
ఇది కూడా చదవండి: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్ ట్యాక్సీ సర్వీసు!
ఇవి కూడా చదవండి
రెండవ ప్రధాన మార్పు సామాజిక భద్రతా ప్రయోజనాలకు సంబంధించింది. ప్రత్యేకించి డెలివరీ బాయ్‌లు వంటి గిగ్ వర్కర్స్‌కు ఇంతకాలం పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్), ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కాదు. కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, డెలివరీ బాయ్‌లు సహా ప్రతి ఉద్యోగికీ ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇది వారికి ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ భద్రత, ఆరోగ్య సంరక్షణలో గణనీయమైన సహాయం అందిస్తుంది.
చివరగా, రోజువారీ కూలీ పని చేసేవారికి కనీస వేతనం విషయంలో కూడా స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కొన్ని రకాల పనులకు మాత్రమే కనీస వేతనాన్ని ప్రభుత్వం నిర్ణయించేది. ఇప్పుడు ప్రభుత్వం ఒక సమగ్ర జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో ప్రతి పనికి ఎంత కనీస వేతనం చెల్లించాలో స్పష్టంగా పేర్కొంటుంది. ఈ నిర్ణయించిన వేతనం కంటే తక్కువ చెల్లించడానికి యజమానులకు అధికారం ఉండదు. ఈ చర్య కూలీలకు సరైన, న్యాయమైన వేతనం అందేలా చూస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
Best Scheme: ఈ ప్రభుత్వ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు!
ఈ కొత్త లేబర్ కోడ్‌లు కార్మికుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తాయి. చిన్నపాటి ఉద్యోగాలు చేసే వారికి ఇది నిజంగా శుభవార్త. వారి పని పరిస్థితులలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి